Sunday, July 7, 2024
HomeతెలంగాణSingareni: సింగరేణిలో 2,266 మంది బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరణ

Singareni: సింగరేణిలో 2,266 మంది బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరణ

2017 నుంచి ఇప్పటి వరకు 13,981 మంది జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజేషన్

సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న 2,266 మందికి సంస్థ తీపి కబురు అందించింది. ఏడాదిలో భూగర్భ గనుల్లో కనీసం 190 రోజులు పనిచేసిన వారికి, ఉపరితల గనులు, విభాగాల్లో కనీసం 240 రోజులు పనిచేసి బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ పర్సనల్, ఫైనాన్స్ ఎన్.బలరామ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబరు 1 తేదీ నుంచి 01.09.2023 వీరందరినీ జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తున్నట్లు ఆదేశాలిచ్చారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గతంలో బదిలీ వర్కర్లుగా ఉద్యోగంలో చేరిన కార్మికులు జనరల్ మజ్దూర్లుగా గుర్తింపు రావడానికి కనీస మస్టర్లు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది.
కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు 2017 నుంచి ఎప్పటికప్పుడు జనరల్ మజ్దూర్లుగా క్రమబద్దీకరిస్తూ వస్తోంది. తొలిసారిగా 2017 అక్టోబరులో ఒకే దఫా 2718 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా గుర్తించింది. అనంతరం ప్రతీ ఏడాది కనీస మస్టర్లు పూర్తి చేసిన వారందరినీ జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తూ రెగ్యులరైజ్ చేస్తోంది. కాగా, డిసెంబరు 31, 2022కు ముందు సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరిన వారిలో కనీసం 190/240మస్టర్ల అర్హత కలిగిన వారందరికీ ఇప్పుడు జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించింది. దీంతో 2017నుంచి ఇప్పటి వరకు జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ అయిన వారి సంఖ్య 13,981కి చేరింది. సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ ప్రక్రియలో ఉద్యోగంలో చేరిన ప్రతీ ఒక్కరినీ తొలుత బదిలీ వర్కర్లుగా సంస్థ నియమిస్తుంది. ఏడాది కాలం పనిచేసిన అనంతరం కనీస హాజర్లు ఉన్న వారిని మాత్రమే జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తుంది. నాటి నుంచి మాత్రమే వారు పూర్తి స్థాయి కంపెనీ ఉద్యోగులుగా గుర్తించబడతారు. దీనిద్వారా పదోన్నతులు పొందడానికి వీలు కలుగుతుంది. కారుణ్య నియామక ప్రక్రియలో సింగరేణిలో చేరిన దాదాపు 16 వేల మంది వారసులలో ఎక్కువ మంది మంచి విద్యార్హతలు కలిగి ఉన్నారు. ఇటువంటి వారు జనరల్ మజ్దూర్లుగా గుర్తింపు పొందటం వల్ల కంపెనీ తరచూ నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల్లో తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగాలను పొందే సదవకాశం ఏర్పడుతుంది. క్రమశిక్షణతో పనిచేసే వారికే మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు డైరెక్టర్ పర్సనల్, ఫైనాన్స్ ఎన్.బలరామ్. ఒకేసారిగా 2266 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించిన అనంతరం ఎన్.బలరామ్ ఒక ప్రకటన చేస్తూ.. సింగరేణిలో ఉద్యోగం రావడం ఒక వరంగా భావించాలని, ఆవిధంగా క్రమ శిక్షణతో విధులకు హాజరవుతూ కనీస మస్టర్లు సాధించిన అందరినీ జనరల్ మజ్దూర్లుగా గుర్తించడం జరిగిందని, వారందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సింగరేణిలో బాగా పనిచేసే వారికి ఎప్పుడూ మంచి గుర్తింపు ఉంటుందన్నారు. గతంలో జనరల్ మజ్దూర్లుగా ఎంపికైన అనేక మంది మరింత శ్రద్ధగా పనిచేస్తూ కంపెనీ నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లో పాల్గొని పదోన్నతులు సాధించారని తెలిపారు. కనుక ప్రతీ ఒక్కరూ విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలని, సంస్థ ఉన్నతితో పాటు మంచి లాభాలు, ఇన్సెంటివ్లు అందుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తం 2266 మంది జనరల్ మజ్దూర్లుగా గుర్తింపబడగా.. వీరిలో శ్రీరాంపూర్ ఏరియా లో 677 మంది, ఆర్జీ-1 ఏరియా నుంచి 522 మంది, ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్టు నుంచి 323, భూపాల పల్లి నుంచి 274 మంది, మందమర్రి నుంచి 261 మంది, మణుగూరు నుంచి 79 మంది, రామగుండం -2 నుంచి 51 మంది, బెల్లంపల్లి ఏరియా నుంచి 32 మంది, ఇల్లందు, కార్పోరేట్ నుంచి 19 మంది చొప్పున ఎంపిక కాగా.. కొత్తగూడెం నుంచి 9 మంది రెగ్యులరైజ్ అయ్యారని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News