Friday, September 20, 2024
HomeతెలంగాణSingareni: కొత్త ఓపన్ కాస్ట్ గనుల నుంచి బొగ్గు

Singareni: కొత్త ఓపన్ కాస్ట్ గనుల నుంచి బొగ్గు

మూడు కొత్త గనుల నుంచి 10 లక్షల టన్నుల బొగ్గు

సింగరేణి సంస్థ మూడు కొత్త ఓపెన్ కాస్ట్ గనులు వీకే కోల్ మైన్, రొంపేడు ఓపెన్ కాస్ట్, గోలేటి ఓపెన్ కాస్టుల నుండి డిసెంబర్ నెలలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మిగిలిన అనుమతులు వేగవంతం చేయాలి నైనీ (ఒడిశా) నుంచి ఈ సెప్టెంబరు నుంచి బొగ్గు ఉత్పత్తి కొత్త గనులపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ చేపట్టిన మూడు కొత్త ఓపెన్ కాస్ట్ గనులలో ఈ ఏడాది డిసెంబర్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని, ఈ గనుల నుండి కనీసం 10లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సంస్థ ఛైర్మన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఆయన సింగరేణి చేపట్టే కొత్త గనులపై ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఈ ఏడాది కొత్తగా ప్రారంభించ దలచిన వీకే కోల్ మైన్ కొత్తగూడెం, రొంపేడు ఓపెన్ కాస్ట్ గని ఇల్లందు, గోలేటి ఓపెన్ కాస్ట్ గని బెల్లంపల్లి గనులకు సంబంధించి ఇంకా మిగిలి ఉన్న అటవీశాఖ అనుమతులను తక్షణమే పొందేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ అనుమతులను సాధించిన వెంటనే డిసెంబర్ నెల నుంచి ఈ గనుల నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలన్నారు.
వీకే కోల్ మైన్ కు సంబంధించి నిర్దేశిత వార్షిక ఉత్పత్తి లక్ష్యం 43 లక్షలు అయినప్పటికీ ఈ ఏడాది కనీసం ఏడు లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలన్నారు. జీకే ఓపెన్ కాస్ట్ గని రొంపేడు ఓసి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 20 లక్షలు అయినప్పటికీ ఈ ఏడాది కనీసం మూడు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాలని, గోలేటి ఓపెన్ కాస్ట్ వార్షిక ఉత్పత్తి లక్ష్యం 35 లక్షలు అయినప్పటికీ ఈ ఏడాది కనీసం ఐదు లక్షల టన్నుల సాధించాలని లక్ష్యాలను నిర్దేశించారు. ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్ కు సంబంధించి అన్ని అనుమతులు లభించిన నేపథ్యంలో ఈ ఏడాది బొగ్గు తవ్వే ప్రాంతంలో గల వృక్ష గణన మరియు వాటి తొలగింపు కార్యక్రమాన్ని మరింత వేగంగా పూర్తి చేయాలని, సెప్టెంబర్ నాటి కల్లా అక్కడ ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ ఏడాదికి సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న 750 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలంటే కొత్త గనుల నుండి ఉత్పత్తి సాధించడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25 లో రామగుండం కోల్ మైన్ ను, ఎంవీకే ఓపెన్ కాస్ట్ గని, మరో రెండు ప్రతిపాదిత ఓపెన్ కాస్టు గనులకు సంబంధించిన అనుమతులను సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఫైనాన్స్, పర్సనల్ ఎన్.బలరామ్, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్.వీ.కే శ్రీనివాస్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ జి.వెంకటేశ్వర రెడ్డి, అడ్వైజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ సురేంద్ర పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జి.ఆల్విన్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ కే.సూర్యనారాయణ, జనరల్ మేనేజర్ సి.పి.పి జక్కం రమేష్, జనరల్ మేనేజర్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ మల్లెల సుబ్బారావు, జనరల్ మేనేజర్ ఎస్టేట్స్ రవి ప్రసాద్, జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ సాయి బాబు సంబంధిత పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News