బెట్టింగ్ యాప్స్ కేసు(Betting Apps Case) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ ప్రధాన అధికారిగా ఐజీ రమేశ్‌ను నియమించారు. ఇందులో సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్ ఉన్నారు. దీంతో పంజాగుట్ట,సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో 25 మంది సెలబ్రిటీలపై నమోదైన కేసులను సిట్ బృందం దర్యాప్తు చేయనుంది. నెలన్నర రోఉల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని డీజీపీ సిట్ ఐజీని ఆదేశించారు.
కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరి, టేస్టీ తేజ, యాంకర్ శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఇక తమను అరెస్ట్ చేయవద్దంటూ విష్ణుప్రియ, శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. వారికి ఊరట లభించింది. అయితే విచారణకు మాత్రం హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇక హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, సన్నీయాదవ్ విదేశాలకు పారిపోయినట్లు గుర్తించారు. వారిని భారత్ రప్పించేందుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.