ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించడంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) స్పందించారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
సభలో అధికార, ప్రతిపక్షాల సభ్యులందరికీ తాను సభాపతిని అని.. ప్రతిపక్షాలు కూడా తనను స్పీకర్‌గా ఎన్నిక కావడానికి సహకరించారనే విషయాన్ని మర్చిపోవద్దని తెలిపారు. అలాంటిది తాను సభలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. సభలో అధికార పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షం సద్వినియోగం చేసుకోవడం లేదని దుయ్యబట్టారు.
కాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీ(MCHRD)భవనంలో ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాల వ్యవహారాలపై శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని, సభలోనికి రాకుండా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. అందుకే ఈ కార్యక్రమానికి తమ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా డిసెంబర్ 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు మాత్రమే జరిగాయి. అనంతరం ఉభయ సభలను డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేశారు. ఈలోపు బీఏసీ మీటింగ్‌లో చర్చించి ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు.