Friday, November 22, 2024
HomeతెలంగాణSrinivas Goud: కులవృత్తులు లేకుంటే నాగరికతే లేదు

Srinivas Goud: కులవృత్తులు లేకుంటే నాగరికతే లేదు

బీసీలకు ఇచ్చే రూ. 1 లక్ష ఉచిత ఆర్థిక సహాయం పథకం నిరంతరం కొనసాగుతుంది

పూర్వం నుండి వ్యవసాయం, అనుబంధ కులవృత్తుల ద్వారానే గ్రామాలు ఏర్పడ్డాయని, కులవృత్తులు లేకుంటే నాగరికతయే లేదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో జిల్లా బి.సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నియోజక వర్గంలోని వెనుకబడిన తరగతులలోని పేదలకు ఇచ్చే రూ. 1 లక్ష ఆర్థిక సహాయం చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… ప్రతి గ్రామంలో వ్యవసాయంతో పాటు, చెరువు, చెరువు కింద వివిధ రకాల వృత్తులు చేసుకునేవారు వారి వారి వృత్తులతో పాటు, వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారని అన్నారు. కాలక్రమేణా సాగునీరు అందక, వర్షాలు లేక విద్యుత్తు సరిగా రాక వ్యవసాయాన్ని వదిలి బతుకుదెరువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయాయని అన్నారు. గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగ చేయడం వల్లే రైతులు, రైతు కూలీలు, వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులను పునరుద్ధరించడం, ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టి రైతులకు రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలను తీసుకు వచ్చిందని అన్నారు.

వృత్తుల పైన ఆధారపడి జీవించేవారు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళితులకు దళిత బంధు, గిరిజనులకు, మైనార్టీలకు ఆర్థిక సహాయం అందించిన విధంగానే వెనుకబడిన కులాలలోని పేదలకు రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీలకు సైతం ఆర్థిక సహాయం అందించడం తమ ఘనత అని అన్నారు.

బీసీల సంక్షేమంలో భాగంగా గతంలో మహబూబ్ నగర్ పట్టణంలో దోబీలకు రూ. 60 లక్షలతో వాషింగ్ మిషన్లను ఏర్పాటు చేశామన్నారు. వడ్రంగులు, నాయి బ్రాహ్మణులు తదితరులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కమ్యూనిటీ భవనాల వంటివి నిర్మించామన్నారు. వెనుకబడిన కులాల ఆర్థిక సహయం పథకం నిరంతరం కొనసాగుతుందని, రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలియజేశారు. ప్రతినెల 300 మంది లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాలలో ఆర్థిక సహాయం విడతలవారీగా అందరికీ వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

పేదవారికి సంక్షేమ పథకాలను అందించడంలో నిష్పక్షపాతంగా ఉంటామని, ఎవరైనా పేదల నుండి లబ్ధి కోసం డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే తక్షణమే వారిపై పోలీస్ కేసు నమోదు చేస్తామన్నారు. పేదల బాగుకోసమే తాము పనిచేస్తామని, గ్రామాల భాగు కోసమే కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతో పాటు ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీటిని, రోడ్లను వేయడం జరిగిందని, ఆసరా పెన్షన్లు, రైతు బీమా, రైతు బంధుతో పాటు అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

ఉచిత విద్యుత్తుకు కేంద్రం ఆటంకాలు సృష్టించినా కేసీఆర్ ఆపలేదు
కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ కు సహాయం అందించకుండా మీటర్లు పెడతామని చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాత్రం బెదురు లేకుండా ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జిడిపిలో, అభివృద్ధిలో ఎవరు సాటిరాని విధంగా రాష్ట్రాన్ని సీఎం ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. ఓవైపు తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే మరోవైపు కేంద్రం మాత్రం ధరలు పెంచుతూ పోతూ సామాన్యుడి నడ్డి విరిస్తోందని మంత్రి తెలిపారు.

మహబూబ్ నగర్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, శిల్పారామంలో ఉన్న స్థలంలో ఒకప్పుడు 30 ఫీట్ల గుంతలు ఉండేవని, అలాంటిది శిల్పారామాన్ని నిర్మించి ఈ ప్రాంతానికి అందాన్ని తీసుకువచ్చామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కారణంగా భూముల ధరలు పెరిగిపోయాయని, మహబూబ్ నగర్- జడ్చర్ల నాలుగు లైన్ల రహదారి, బైపాస్ రహదారితో పాటు, అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థన మందిరాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గత సంవత్సరం వర్షపు నీటికి రామయ్య బౌలి ప్రాంతం నీటిలో మునిగిపోయిందని, అలాంటిది నాళాలు విస్తరించడం, ఈ సంవత్సరం మురికి కాలువలు శుభ్రం చేయటం కారణంగా వర్షం నీరు మినీ ట్యాంక్ బండ్ లోకి వెళ్తోందన్నారు. హాస్టల్ ద్వారా విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని, హాస్పిటళ్లలో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని, అధికారులు నిష్పక్షపాతంగా జిల్లాలో పనిచేస్తున్నారని అన్నారు.

రూ.1లక్ష ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇస్తున్న రూ.1లక్ష ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మరో రూ. 100 కోట్లను తీసుకువచ్చామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఇటీవలే రూ.276 కోట్లు విడుదల కాగా… ఎస్టీపి, మెయిన్ ట్రంక్ పనులను చేపడుతున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ ను మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వస్తే జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. పెద్ద చెరువును కృష్ణా నది నీటిని నింపుతామని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 15,787 దరఖాస్తులు…
కాగా బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం జిల్లా వ్యాప్తంగా 15,787 దరఖాస్తులు రాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సుమారు 14000 దరఖాస్తులను అర్హమైనవిగా గుర్తించింది. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 4779 దరఖాస్తులు రాగా… అందులో 4221 దరఖాస్తులు అర్హత ఉన్నవిగా గుర్తించగా, ఈనెలకు సంబంధించి 300 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా ఒక్కోక్కరికి రూ. 1లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. శిల్పారామం లోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఒకేసారి 300 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారితో సెల్ఫీ దిగారు.

కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, ఎంపీపీలు బాలరాజు, సుధాశ్రీ, కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News