సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్(SriTej Health Bulletin) విడుదల చేశారు. వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడని తెలిపారు. కానీ మళ్ళీ జ్వరం పెరుగుతోందని పేర్కొన్నారు. వైట్ బ్లడ్ సెల్స్.. మిగతా సెల్స్ అన్ని ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాయన్నారు. ఆహారం తీసుకుంటున్నాడని అయితే నాడి వ్యవస్థ పనితీరు ఇప్పటికీ ఇంప్రూవ్ కాలేదని ప్రకటించారు.
ఇక తాజాగా శ్రీ తేజ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. కోమటిరెడ్డి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ‘పుష్ప2’ నిర్మాతలు శ్రీ తేజ్‌ను పరామర్శించేందుకు వచ్చారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సమక్షంలో రూ.50లక్షల చెక్ బాధిత కుటుంబానికి అందజేశారు.