తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు(SSC Exams) ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులను తనిఖీలు చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఈసారి 24 పేజీల బుక్‌లెట్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 4వ తేదీతో ముగియనున్న ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. మొత్తం 2,650 పరీక్షా కేంద్రాల్లో 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
పర్యవేక్షణ కోసం 2650 డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్టూడెంట్స్ అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈసారి పరీక్ష రాసే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ప్రకటించారు. అంతే పరీక్ష టైం కంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. కానీ ముందు జాగ్రత్తగా కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి రావాలని సూచించారు.