Telangana Education Department On Aadhaar Update: మీ పిల్లల ఆధార్ కార్డులో తప్పులున్నాయా..? పుట్టినతేదీ, పేరు సరిపోలడం లేదా? ఈ సమస్యల పరిష్కారానికి ఆధార్ కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారా? అయితే, విద్యార్థులు, తల్లిదండ్రుల ఈ అవస్థలకు రాష్ట్ర విద్యాశాఖ చెక్ పెట్టనుంది. ఇకపై ఆధార్ నవీకరణ సేవలను బడి గడప వద్దకే తీసుకురానుంది. ఇంతకీ, ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణమేంటి..? యూడైస్ (UDISE) నమోదుకు, ఆధార్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కొత్త విధానం ఎలా పనిచేయనుంది..?
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఆధార్ నవీకరణ ఒకటి. కార్డులో దొర్లిన చిన్న చిన్న తప్పులను సరిచేయించుకోవడానికి, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఈ తిప్పలకు ముగింపు పలుకుతూ, రాష్ట్ర విద్యాశాఖ నేరుగా పాఠశాలల్లోనే ఆధార్ నమోదు మరియు నవీకరణ శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించింది.
అసలు సమస్య ఎక్కడ : ప్రతి విద్యార్థి వివరాలను కేంద్ర ప్రభుత్వ విద్యా పోర్టల్ అయిన యూడైస్ (UDISE – Unified District Information System for Education)లో నమోదు చేయడం తప్పనిసరి. ఇలా నమోదైన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ పథకాలైన ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, రాత పుస్తకాలు, రవాణా భత్యం వంటివి అందుతాయి. అయితే, యూడైస్‌లో నమోదుకు విద్యార్థి ఆధార్ కార్డు వివరాలు కచ్చితంగా సరిపోలాలి. పాఠశాల రికార్డుల్లోని పేరు, పుట్టినతేదీకి, ఆధార్ కార్డులోని వివరాలకు మధ్య వ్యత్యాసం ఉండటంతో వేలాది మంది విద్యార్థుల నమోదు ప్రక్రియ నిలిచిపోతోంది.
ALSO READ:https://teluguprabha.net/telangana-news/khazana-jewellery-chandangar-robbery-solved-seven-arrested/
ఒక్క నారాయణపేట జిల్లాలోనే 98,922 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 7,139 మందికి అసలు ఆధార్ గుర్తింపే లేదు. దీంతో ఉపాధ్యాయులు, అధికారులు విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేక నానా అవస్థలు పడుతున్నారు.
ఆధార్ లేని అభాగ్యులు : బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న సిరిగిరి బాలు పరిస్థితి అత్యంత దయనీయం. తల్లిదండ్రులు లేని ఈ బాలుడికి జనన ధ్రువీకరణ పత్రం గానీ, ఆధార్ కార్డు గానీ లేవు. కేవలం ఈ ఒక్క పాఠశాలలోనే బాలు వంటి విద్యార్థులు 16 మంది వరకు ఉన్నారు. వీరి భవిష్యత్తు, ప్రభుత్వ ఫలాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇలాంటి అభాగ్యుల కోసమే అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
విద్యాశాఖ కార్యాచరణ ఇదే : ఈ సమస్యలను అధిగమించేందుకు విద్యాశాఖ రంగంలోకి దిగింది. నారాయణపేట జిల్లా సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం:
తేదీ: ఈ నెల 18వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో ఆధార్ శిబిరాలు ప్రారంభం కానున్నాయి.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/singareni-women-rescue-team-underground-mining/
విధానం: ప్రతి మండలానికి ఒక మొబైల్ ఆధార్ కిట్ అందుబాటులో ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు నేరుగా ఈ కిట్‌ను తీసుకెళ్లి అక్కడే నమోదు, నవీకరణ ప్రక్రియ పూర్తి చేస్తారు.
ప్రత్యేక శిబిరాలు: తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలన్నింటినీ కలిపి, సమీపంలోని ఒక కేంద్రంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. గతంలో 2019-20లో ఈ కార్యక్రమం ప్రారంభమైనా, కరోనా కారణంగా రెండేళ్లు నిలిచిపోయింది. గతేడాది తిరిగి ప్రారంభించబడిన ఈ ప్రక్రియ ప్రస్తుతం ప్రైవేటు ఏజెన్సీల భాగస్వామ్యంతో వేగవంతమైంది


