మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రజా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న డిమాండ్లు చేస్తున్న వేళ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిపై స్పందించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తుపాకీ పట్టి అమాయకులపై దాడులు చేసినవారితో ఎలాంటి చర్చలు జరగవు. మావోయిస్టులతో కేంద్రానికి మాట్లాడే ఉద్దేశం లేదు. తుపాకీలు వదలకపోతే శాంతి సాధ్యం కాదు అంటూ బండి సంజయ్ అన్నారు. అంతేకాదు, మావోయిస్టులను నిషేధించినది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. ఒకవైపు మావోయిస్టులు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలపై బాంబుల దాడులు చేసి ప్రాణాలు తీశారని, మరోవైపు గిరిజనులపై అన్యాయం చేసి, ఫేక్ కేసుల్లో ఇన్‌ఫార్మర్లుగా ముద్ర వేసి కాల్చిచంపారని విమర్శించారు.
ఇక కేంద్ర కులగణనను చారిత్రాత్మకంగా అభివర్ణించిన సంజయ్, దానిని కాంగ్రెస్ విజయంగా చిత్రీకరించడాన్ని విమర్శించారు. మోదీ కులగణనకు, కాంగ్రెస్ కులగణన సర్వేకు పోలికే లేదన్నారు. కాంగ్రెస్ చేసిన కులగణనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని. వారి జనాభా తక్కువగా చూపారన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. విదేశీ పాస్ పోర్టులు లేని వారిని గుర్తించి పంపిస్తున్నామని వెల్లడించిన బండి సంజయ్, హింగ్యాలపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టంగా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. శాంతి భద్రతల అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం సరైంది కాదని హితవు పలికారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చినప్పటికీ రేవంత్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. “కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే. ఇవి మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నాయి. కానీ కేంద్రానికి నక్సల్స్‌తో చర్చల గురించి మాట్లాడే ఆలోచన లేదు అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు. మావోయిస్టులతో శాంతిచర్చలు అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తిరస్కరిస్తోందని, శాంతి కోసం ముందుగా హింసను విరమించాల్సిందేనని బండి సంజయ్ వ్యాఖ్యలు మరొకసారి తేల్చిచెప్పాయి.