అధికారుల అండతోనే తాండూరులో ఇసుక మాఫియా జోరుగా కొనసాగుతోందని గ్రామస్తులు మీడియాతో చెబుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల్ మండలం విశ్వనాథ్ పూర్ గ్రామ శివారులోని నది నుండి అక్రమంగా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. మా గ్రామంలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగించేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు నిర్వహిస్తున్నారని, అధికార యంత్రాంగం సహాయంతోనే పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్తున్నారు. ఒకవేళ అనుమతులు ఉన్నా కూడా ఒక మండలం నుంచి ఇంకో మండలం కి ఇసుకను రవాణా ఎలా చేస్తారు అని ప్రశ్నించారు ? అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని గ్రామస్థులు అడ్డుకుంటే వారిని బెదిరిస్తున్నారు. ప్రభుత్వ పనుల కొరకు అనుమతులు అని, మధ్యలోనే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అమ్ముకుంటున్నారు అని అన్నారు. ఈ దందాపై అధికారయంత్రాంగానికి పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం వల్లే ఇసుక దందా జోరుగా సాగిపోతోందని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇష్టానుసారంగా హద్దు అదుపు లేకుండా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతుండడంతో సాగు – తాగు నీటికి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు పేర్కొన్నారు. అధికారులు నిబంధనలు ఉల్లంఘించి అక్రమ తవ్వకాలు దగ్గర ఉండి కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. యాలాల, తాండూరు తదితర మండలాల్లో రూ.లక్షలు విలువ చేసే ఇసుక అన్యాక్రాంతమైపోయిందని అక్కడి ప్రజలు చెప్తున్నారు. అనుమతి తీసుకున్నా కూడ అంతకు పదిరెట్లు ఇసుకను తీసుకుపోతున్నట్లు స్థానికులు స్పష్టంచేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక దందాపై అధికారులు పెద్ద ఎత్తున ఉన్నట్లు సమాచారం. ఇలానే ఉంటే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇసుక కావాలని అడిగిన వారికి అనుమతులు ఇచేస్తున్న అధికారులు పర్యవేక్షణపై దృష్టి సారించడంలేదని దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగించేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి యాలాల్ మండలంలో సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలకు చెక్ పెట్టాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలా కాకుండా అక్రమార్కులను వదిలేస్తే గ్రామాల్లో ఉన్న నదులు ఉనికే ప్రమాదంలో పడుతుందని, వేసవిలో నీటి కోసం మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు.