విద్యార్థులకు బస్ కష్టాలు తప్పడం లేదు. సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో విద్యార్థులు నానాకష్టాలు పడుతున్నారు. ఉన్న అరకొర బస్సులు సమయానికి రావడం లేదు. దీంతో వచ్చిన బస్సులోనే తొందరగా వెళ్లిపోవాలనే ఆత్రుతతో విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. విద్యార్థుల ప్రయాణం రోజు రోజుకు ప్రమాదకరంగా సాగుతోంది. వికారాబాద్ జిల్లా తాండూరు డిపోకి చెందిన బస్సు రాస్నం – ధరూర్ వరకు ఉదయం, సాయంత్రం సమయంలో వెళ్లే ఆర్టీసీ బస్సులో స్థలం లేక, ఎక్కే పుట్‌వేర్‌పై నిల్చొని విద్యార్థులు, ప్రయాణికులు రోజూ నానా కష్టాలు పడుతూ ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. అలా ప్రయాణం చేసినప్పుడు జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు నష్టపోతారు, ఎవరు బాధ్యత వహిస్తారాని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ బస్సు మిస్సయితే ప్రయివేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తుంది. ఒక వేళా ఉదయం మిస్సయినా వేరే వాహనాల్లో పట్టణానికి చేరుకోవచ్చు. అదే సాయంత్రం వేళలో బస్సు సమయం తప్పిస్తే ఇక సొంతూళ్లకు చేరుకోవాలంటే నానా కష్టాలు పడాల్సి వస్తుంది. దీంతో చేసేది లేక ఉన్న ఒక్క బస్సులోనే ఎంత కష్టమైనా గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఆర్టీసీ డిపో మేనేజర్, ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి ఎక్కువ బస్సులు నడపాలని కోరుతున్నారు.