Telangana BC reservations Supreme Court : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై మొదలైన న్యాయపోరాటం కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎన్నికల ప్రక్రియ అగమ్యగోచరంగా మారిన వేళ, తెలంగాణ ప్రభుత్వం ఈ పంచాయితీని దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెం.9 అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ నిర్ణయంతో స్థానిక సమర భవిష్యత్తు ఇప్పుడు ఢిల్లీ వేదికగా తేలనుంది.
హైకోర్టు స్టే… సుప్రీంకోర్టుకు ఎస్ఎల్పీ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను, ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పు కాపీ అందిన వెంటనే కార్యాచరణలోకి దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం, దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయాలని ఖరారు చేసింది. శనివారం కాంగ్రెస్ ముఖ్య నేతలు సీనియర్ న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతో జూమ్ సమావేశం నిర్వహించి న్యాయపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టు స్టేను ఎత్తివేసి, ఎన్నికల ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.
సుప్రీంలో సర్కార్ వినిపించబోయే కీలక వాదనలు : అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వం ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించనుంది.
ఎన్నికల ప్రక్రియలో జోక్యం తగదు: రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఎన్నికల ప్రక్రియ ఒకసారి ప్రారంభమయ్యాక, ముఖ్యంగా నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైన తరుణంలో న్యాయస్థానాల జోక్యం సరికాదని ప్రభుత్వం వాదించనుంది. ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అనేక తీర్పులకు అనుగుణంగా ఉందని గుర్తు చేయనుంది. శాస్త్రీయ అధ్యయనం, చట్టబద్ధత: బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నది కాదని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే జనాభా గణాంకాలపై శాస్త్రీయ సర్వే నిర్వహించామని ప్రభుత్వం స్పష్టం చేయనుంది. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6 శాతంగా ఉన్నందున, వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం న్యాయబద్ధమేనని వాదించనుంది. రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ శాసనసభలో చట్టం తీసుకొచ్చిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది.
వ్యూహం-ప్రతివ్యూహం: కేవియట్ దాఖలు : ప్రభుత్వం అత్యవసరంగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరే అవకాశాలున్న నేపథ్యంలో, ఈ జీవోలను హైకోర్టులో సవాలు చేసిన పిటిషనర్లు బి.మాధవరెడ్డి, మరొకరు అప్రమత్తమయ్యారు. వారు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనివల్ల, ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్‌పై తమ వాదనలు వినకుండా న్యాయస్థానం ఏకపక్షంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడానికి వీలుండదు. దీంతో ఈ న్యాయపోరాటం మరింత ఆసక్తికరంగా మారింది.
అంతర్గత సమాచారం ప్రకారం, ప్రభుత్వం ముందు మూడు ప్రత్యామ్నాయాలపై చర్చ జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్లడం, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సుప్రీం తీర్పు వచ్చేవరకు ఆగడం, లేదా పార్టీపరంగా 42% టికెట్లను బీసీలకు కేటాయించడం వంటి అంశాలను పరిశీలించినప్పటికీ, న్యాయపరంగానే తేల్చుకోవాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టుకు వెళ్లడమే శ్రేయస్కరమని ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.


