Telangana cyber crime alert : నేను ఆర్మీ కమాండోని, ఇల్లు అద్దెకు కావాలి.. డీమార్ట్ సరుకులు సగం ధరకే.. మీ పాత నాణేలకు లక్షలొస్తాయి.. ఇలాంటి ప్రకటనలు, ఫోన్ కాల్స్ వస్తున్నాయా..? ఒక్క క్షణం ఆగండి! సైబర్ నేరగాళ్లు వేసిన కొత్త గాలం ఇది. చిన్న సందు దొరికినా చాలు, మన ఆశను, అవసరాన్ని ఎరగా వేసి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. సాంకేతికత పెరిగే కొద్దీ మోసాలు కూడా రూపు మార్చుకుంటున్నాయి. తెలంగాణలో పెచ్చరిల్లుతున్న ఈ కొత్త తరహా సైబర్ నేరాల తీరుతెన్నులేంటి? అమాయకులను ఎలా బుట్టలో వేసుకుంటున్నారు? వారి బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా?
కమాండో అవతారం.. ఖాతాకు కన్నం : ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని అద్దెకు ఇస్తానని ‘మ్యాజిక్ బ్రిక్స్’ వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చారు. వెంటనే, ఆశిష్ కుమార్ పహార్ అనే వ్యక్తి ఫోన్ చేసి, తాను ఎన్‌ఎస్‌జీ కమాండోనని, పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ బదిలీపై వస్తున్నానని నమ్మబలికాడు. నమ్మకం కోసం ఏకంగా ఎన్‌ఎస్‌జీ కమాండో దుస్తుల్లో ఉన్న ఫొటోలు పంపాడు. ఆ తర్వాత, తాను ఎన్‌ఎస్‌జీ ఉన్నతాధికారినంటూ మరో వ్యక్తి ఫోన్ చేసి, భద్రతా కారణాల దృష్ట్యా (పుల్వామా దాడి తర్వాత నిబంధనలు కఠినతరం అయ్యాయని చెప్పి) ఇంటి యజమాని బ్యాంకు ఖాతా వివరాలు సరిచూడాలన్నాడు. వివరాలు సరిపోవట్లేదని, పేరు మ్యాచ్ అవ్వట్లేదని రకరకాల సాకులు చెబుతూ, బాధితుడి చేతే పలుమార్లు డబ్బులు వేయించుకున్నాడు. అలా కేవలం మూడు రోజుల్లోనే రూ.12.75 లక్షలు కాజేశాడు. స్నేహితుల ద్వారా అసలు విషయం తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు
డీమార్ట్ ఆఫర్.. డెబిట్ షాక్ : డీమార్ట్ రెడీ యాప్ ద్వారా అతి తక్కువ ధరకు నిత్యావసరాలు వస్తాయన్న ఆకర్షణీయమైన ప్రకటనను చూసి 66 ఏళ్ల వృద్ధురాలు క్లిక్ చేశారు. రూ.298 విలువైన వస్తువులను కార్ట్‌లో వేసి, చెల్లింపు కోసం తన క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేశారు. ఓటీపీ ఎంటర్ చేయగానే, మూడు విడతల్లో ఏకంగా రూ.1.17 లక్షలు ఆమె ఖాతా నుంచి మాయమయ్యాయి. ఆఫర్ ఆశ చూపి, కేటుగాళ్లు ఆమె ఖాతాను ఖాళీ చేశారు.
పాత నాణేల పంతం.. పోయింది ధనం : ఫేస్‌బుక్‌లో పాత నాణేలు అధిక ధరకు అమ్ముకోవచ్చన్న ప్రకటన చూసి 74 ఏళ్ల వృద్ధుడు ఆశపడ్డాడు. ప్రకటనలోని వ్యక్తిని సంప్రదించగా, ఆ నాణేల విలువ రూ.72 లక్షలని నమ్మించాడు. అయితే, ఆర్బీఐ క్లియరెన్స్, కొరియర్, ఇతర ఖర్చుల పేరుతో విడతల వారీగా రూ.4.27 లక్షలు వసూలు చేశాడు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిపుణుల హెచ్చరిక: ఈ జాగ్రత్తలు తప్పనిసరి : సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని సైబర్ క్రైమ్ పోలీసులు మరియు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుర్తింపు ధ్రువీకరణ: వాట్సాప్‌లో పంపే ఆర్మీ/ప్రభుత్వ ఐడీ కార్డులను గుడ్డిగా నమ్మవద్దు. వారి గుర్తింపును అధికారిక .gov.in లేదా .nic.in డొమైన్ ఉన్న ఈ-మెయిల్ ద్వారా మాత్రమే ధ్రువీకరించుకోవాలి.
ముందస్తు చెల్లింపులు వద్దు: అద్దె లేదా అడ్వాన్స్ పేరుతో ఎప్పుడూ ముందుగా డబ్బులు పంపవద్దు.
అవాస్తవ ఫీజులు: నిజమైన కొనుగోలు-అమ్మకాల్లో రిజిస్ట్రేషన్, ఆర్బీఐ ఎన్వోసీ, జీఎస్టీ వంటి ఫీజులు ఉండవు. ఇలా డబ్బులు అడిగితే అది కచ్చితంగా మోసమే.
వ్యక్తిగత సమాచారం పదిలం: మీ ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్ ఫొటోలను, ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు.
తెలియని లింకులు, క్యూఆర్ కోడ్‌లు: సోషల్ మీడియాలో, మెసేజ్‌లలో వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయవద్దు. ఎవరైనా పంపిన క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయవద్దు, అలా చేస్తే మీ ఖాతాలో డబ్బులు పోయే ప్రమాదం ఉంది. ఏమాత్రం అనుమానం వచ్చినా లేదా మోసపోయినట్లు భావించినా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫోన్ చేయాలి లేదా http://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.


