Pharmaceutical manufacturing regulations : దగ్గు మందే పసిపిల్లల పాలిట యమపాశంగా మారింది! మధ్యప్రదేశ్‌లో దగ్గు సిరప్ వికటించి చిన్నారులు మృత్యువాత పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం (DCA) ఉలిక్కిపడింది. రాష్ట్రంలో ఫార్మా కంపెనీలపై ఉక్కుపాదం మోపింది. ఎక్కడైనా ప్రమాదకరమైన బ్యాచ్ సిరప్‌లు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటూ ప్రజలను అప్రమత్తం చేసింది. అసలు సిరప్‌లలో కలిసే ఆ విషపదార్థాలేంటి? వాటిని అరికట్టేందుకు డీసీఏ తీసుకుంటున్న చర్యలేంటి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నిఘా నీడలో 42 కంపెనీలు : మధ్యప్రదేశ్ ఘటన అనంతరం రాష్ట్ర డీసీఏ అధికారులు పూర్తి అప్రమత్తత ప్రకటించారు. తెలంగాణలో సిరప్‌లను తయారుచేస్తున్న సుమారు 42 ఫార్మా కంపెనీల ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమై దిశానిర్దేశం చేశారు. తయారీలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా, నిషేధిత బ్యాచ్‌కు చెందిన సిరప్‌లపై గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు.
తయారీలో కఠిన నిబంధనలు ఇవే : పిల్లల ప్రాణాలతో ముడిపడి ఉన్నందున, సిరప్‌ల తయారీలో ఫార్మా కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను డీసీఏ స్పష్టం చేసింది.
ముడిసరుకుల సేకరణ: ఔషధాల తయారీలో వినియోగించే గ్లిజరిన్, ప్రొపిలిన్ గ్లైకాల్ వంటి ద్రావణాలను నేరుగా వాటి అసలు తయారీదారుల నుంచే సేకరించాలి. మధ్యవర్తుల ప్రమేయం ఉండకూడదు.
విషపదార్థాల పరీక్ష: సిరప్‌లలో వినియోగించే ముందు, ఆ ద్రావణాలలో డై ఇథలిన్ గ్లైకాల్ (DEG), ఇథలిన్ గ్లైకాల్ (EG) వంటి అత్యంత హానికరమైన విషపదార్థాలు లేవని ప్రయోగశాలల్లో పరీక్షించి నిర్ధారించుకోవాలి.
నివేదికల సమర్పణ: ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాల నివేదికలను ఎప్పటికప్పుడు డీసీఏకి తప్పనిసరిగా అందజేయాలి.
ప్రభుత్వ సరఫరాపై పటిష్ఠ చర్యలు : ప్రభుత్వ ఆసుపత్రులకు సిరప్‌లను సరఫరా చేసే తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGMSIDC)కు డీసీఏ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టీజీఎంఎస్‌ఐడీసీకి సిరప్‌లు సరఫరా చేసే 14 సంస్థలలో 13 కంపెనీలకు WHO-GMP (ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన నాణ్యతా ప్రమాణాలు) ఉన్నట్టు అధికారులు నిర్ధారించుకున్నారు. నిబంధనలు పాటించని ఒక సరఫరాదారును గతంలోనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా అవుతున్న సిరప్‌లన్నీ పూర్తి సురక్షితమేనని అధికారులు ప్రకటించారు.
నిషేధిత మందులు.. విచ్చలవిడి అమ్మకాలు : నగరంలో వైద్యుని సిఫారసు (ప్రిస్క్రిప్షన్) లేకుండానే దగ్గు మందులను విచ్చలవిడిగా విక్రయిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కల్తీ జరిగినట్లు గుర్తించిన రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్, కోల్డ్ రిఫ్ అనే దగ్గు మందులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మందులు ఎక్కడా విక్రయించకుండా చూడాలని డీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు కూడా ఈ మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరింది.


