Telangana dog bite crisis : నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా వీధి శునకాల సంచారం పెరిగిపోయింది. ఈ కుక్కల గుంపులు వీధుల్లో స్వైరవిహారం చేస్తూ ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆడుకునే చిన్నారుల నుంచి పనులకు వెళ్లే పెద్దల వరకు ఎవరిపై దాడి చేస్తాయోనన్న భయం ప్రతిక్షణం వెన్నాడుతోంది. రాష్ట్రంలో సగటున గంటకు 14 మంది కుక్క కాటుకు గురవుతున్నారన్న చేదు వాస్తవం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటంతో ఈ సమస్య పెనుభూతంలా మారుతోంది. అసలు ఈ శునకాల బెడదకు మూల కారణమేంటి..? దీనికి అడ్డుకట్ట వేయడంలో మనం ఎక్కడ విఫలమవుతున్నాం..?
కుక్కల సంఖ్యను నియంత్రించడంలో ఘోర వైఫల్యం.. ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. కేవలం గాయాలతోనే సరిపోవడం లేదు, అత్యంత ప్రమాదకరమైన రేబిస్ వ్యాధి బారినపడి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
గణాంకాల ఘోష.. భయపెడుతున్న వాస్తవాలు : ప్రభుత్వ లెక్కలే ప్రజల భయానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
రాష్ట్రంలో: గత సంవత్సరం (2023) ఏకంగా 1,21,997 మంది కుక్కకాటుకు గురయ్యారు. ఈ ఏడాది జులై వరకు కేవలం ఏడు నెలల్లోనే 87,366 కేసులు నమోదయ్యాయి. అంటే సగటున ప్రతి గంటకు 14 మంది కుక్కల దాడికి గురవుతున్నారు. గతేడాది 13 మంది రేబిస్‌తో మరణించారు.
దేశవ్యాప్తంగా: 2024లో దేశవ్యాప్తంగా 37 లక్షల మంది కుక్కకాటు బాధితులుగా మారారు.
ప్రపంచ స్థాయిలో: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబిస్ మరణాల్లో 36% మన దేశంలోనే సంభవిస్తుండటం అత్యంత ఆందోళన కలిగించే విషయం. బాధితుల్లో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు చిన్నారులే కావడం హృదయ విదారకం.
న్యాయస్థానాల జోక్యం.. దేశవ్యాప్త చర్చ : సమస్య తీవ్రతను గమనించిన న్యాయస్థానాలు సైతం స్పందించాయి.
సుప్రీంకోర్టు: దిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించకుండా వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించాలని, వీధుల్లో వాటికి ఆహారం పెట్టడం నిషిద్ధమని తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ అంశంపై విచారణకు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడంతో ఇది దేశవ్యాప్త చర్చకు దారితీసింది.
హైకోర్టు: 2023లో నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సుమోటోగా కేసును విచారణకు స్వీకరించింది. జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న చర్యలపై ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. జంతు క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం హాని చేసే కుక్కలకు ప్రశాంత మరణం (Euthanasia) కల్పించే అధికారం ఉందని జీహెచ్‌ఎంసీ కోర్టుకు తెలిపింది.
జంతు ప్రేమికులు వర్సెస్ బాధితులు : సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సమాజం రెండుగా చీలినట్లు కనిపిస్తోంది. ఒకవైపు జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు శునకాలపై కరుణ చూపాలని, వాటికీ జీవించే హక్కు ఉందని సోషల్ మీడియాలో, రోడ్లపైనా ఉద్యమిస్తున్నారు. మరోవైపు కుక్కకాటు బాధితులు, వారి కుటుంబ సభ్యులు.. తమ ప్రాణాలకు రక్షణ లేదా? అంటూ వారి వాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
విదేశాల్లో ఎలా మనదగ్గర ఎలా.. ? : యూకే, అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో వీధి కుక్కల సమస్య దాదాపుగా లేదు. అక్కడ వీధిలో కుక్క కనిపిస్తే వెంటనే బంధించి, వారం రోజుల్లోగా ఎవరూ తీసుకెళ్లకపోతే ప్రశాంత మరణం కల్పిస్తారు. పెంపుడు కుక్కల విషయంలోనూ యజమానులకు కఠిన నిబంధనలుంటాయి. కానీ మన దేశంలో చట్టాలు, వాటి అమలులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
పరిష్కారమేంటి – నిపుణులు ఏమంటున్నారు? : “తెలంగాణలో సుమారు 20 లక్షల వీధి కుక్కలు ఉండొచ్చని అంచనా. రెండు ఉండాల్సిన వీధిలో 20 ఉంటున్నాయి. సమస్యను కట్టడి చేయాలంటే యుద్ధప్రాతిపదికన అన్ని కుక్కలకూ సంతాన నిరోధక (ABC) ఆపరేషన్లు చేయాలి. కానీ ప్రభుత్వాల వద్ద మౌలిక సదుపాయాల కొరత ఉంది. ‘పట్టుకోండి -సంతానాన్ని నిరోధించండి – టీకా వేయండి – వదిలేయండి’ (CNVR) అనే విధానం మంచి ఫలితాలనిచ్చినా, కేంద్ర జంతు సంక్షేమ బోర్డు అనుమతులు ఇవ్వడం లేదు. ఈ అంశాలపై విస్తృత చర్చ జరగాలి” అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.


