Telangana drug trafficking : మత్తు మహమ్మారి యువత భవితను కబళిస్తుంటే, దానిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్’ బృందం పంజా విసురుతోంది. నెలకు కోట్లలో విలువ చేసే మత్తు పదార్థాలు పట్టుబడుతున్నా, ఈ విష వలయాన్ని నడిపించే అసలు సూత్రధారులు మాత్రం దొరకడం లేదు. కేసు నమోదు కాగానే విదేశాలకు ఎలా చెక్కేస్తున్నారు? చిట్టెలుకలను పట్టుకుంటుంటే, తిమింగలాలు ఎలా తప్పించుకుంటున్నాయి..?
తెలంగాణలో మాదకద్రవ్యాల వినియోగం పెను భూతంగా మారుతోంది. సరదాగా మొదలై, యువత జీవితాలను సర్వనాశనం చేస్తోంది. ముంబయి, గోవా, బెంగళూరు అడ్డాలుగా సాగుతున్న ఈ డ్రగ్స్ దందా, ఇంజినీరింగ్, వైద్య కళాశాలల విద్యార్థులను సైతం లక్ష్యంగా చేసుకుంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఈగల్’ (ఎన్‌ఫోర్స్‌మెంట్ అగైనెస్ట్ గంజాయి అండ్ అదర్ లిక్విడ్స్) విభాగాన్ని రంగంలోకి దించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం ప్రశంసించేలా ఈ బృందం పనిచేస్తోంది.
‘ఈగల్’ బృందం నెలకు సగటున రూ.10 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సాధారణ గంజాయి మాత్రమే కాదు, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న రూ.12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్స్ గంజాయిని సైతం ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు.
దర్యాప్తునకు పెను సవాల్ – పరారీలో సూత్రధారులు: ‘ఈగల్’ బృందం ఎంతగా శ్రమిస్తున్నా, వారి ప్రయత్నాలకు ఓ పెద్ద అవరోధం ఎదురవుతోంది. అదే, ప్రధాన నిందితులు పరారవ్వడం. కేసు నమోదు అయిన విషయం తెలియగానే, కీలక సూత్రధారులు విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారు. దీంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. 2023లో నమోదైన కేసులకు సంబంధించి ఇంకా 1131 మంది నిందితులు పరారీలోనే ఉన్నారంటే, ఈ సమస్య ఎంత జటిలంగా ఉందో తెలుస్తోంది. ఈ ఏడాది తొలి 7 నెలల్లోనే 3412 మందిని అరెస్ట్ చేయగా, మరో 1876 మంది ఆచూకీ ఇంకా లభించలేదు.
శిక్షల్లో జాప్యం – నేరగాళ్లకు అలుసు: ఏదైనా కేసులో కీలక నిందితులు దొరకనప్పుడు, అభియోగపత్రాలు దాఖలు చేసి, న్యాయ విచారణ పూర్తి చేయడం కష్టసాధ్యంగా మారుతోంది. ఫలితంగా, పట్టుబడిన వారికి కూడా శిక్షలు పడటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మాదకద్రవ్యాల కేసుల్లో కఠిన శిక్షలు ఉన్నప్పటికీ, అవి అమలు కాకపోవడంతో నేరస్థుల్లో భయం కొరవడుతోంది. ఇదే అలుసుగా తీసుకుని వారు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు, ఇతర రాష్ట్రాల పోలీసులతో మరింత సమన్వయంతో పనిచేసి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు అధికారులు వ్యూహాలు రచిస్తున్నారు.


