Telangana government land data collection : నానాటికీ పెరిగిపోతున్న భూ కబ్జాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ప్రభుత్వ స్థలాల లెక్క తేల్చేందుకు సిద్ధమైంది. దశాబ్దకాలంగా నవీకరణకు నోచుకోని నిషేధిత జాబితాను సైతం సవరించబోతోంది. ఇంతకీ రాష్ట్రంలో ప్రభుత్వ భూమి ఎంత..? అన్యాక్రాంతమైంది ఎంత..? ఈ లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న పక్కా వ్యూహమేంటి..?
గత దశాబ్దకాలంగా తెలంగాణలో ప్రభుత్వ భూముల కబ్జా విచ్చలవిడిగా పెరిగిపోయింది. నాలాలు, చెరువు శిఖం భూములు, పార్కు స్థలాలను సైతం వదలకుండా అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి, అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇటీవల మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గాజులరామారంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ప్లాట్లుగా విక్రయించిన ఉదంతం ప్రభుత్వానికి వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో మేల్కొన్న ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల సమగ్ర లెక్కలు తేల్చేందుకు పూనుకుంది.
ఐదు ఫార్మాట్లలో వివరాల సేకరణ: ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు, పేదలకు పంపిణీ చేసినవి, ప్రస్తుతం మిగులు ఉన్నవి, అన్యాక్రాంతమైన వాటి వివరాలను ఐదు నిర్దిష్ట ఫార్మాట్లలో సేకరిస్తోంది.
నవీకరణకు నోచుకోని ‘నిషేధిత జాబితా’: భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడంలో భారత స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టం-1908లోని సెక్షన్-22ఏ(1) కింద రూపొందించే ‘నిషేధిత జాబితా’ అత్యంత కీలకం. ఈ జాబితాలో చేర్చిన భూములను రిజిస్టర్ చేయడానికి వీలుండదు. అయితే, రాష్ట్రంలో 2014 నుంచి ఈ జాబితాను సవరించకపోవడంతో భూదాన్, వక్ఫ్, దేవాదాయ శాఖకు చెందిన వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ నేపథ్యంలో, గ్రామస్థాయి నుంచి ఈ జాబితాను నవీకరించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయికి ఆదేశాలు: రెవెన్యూశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. తహసీల్దార్లు ఐదు రకాల ఫార్మాట్లలో భూముల వివరాలను నమోదు చేస్తున్నారు.
ఎసైన్డ్ భూములు: ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూములు, వాటి యజమానుల వివరాలు.
బదిలీ చేసినవి: ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేసిన ప్రభుత్వ భూములు, వాటికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు.
సంస్థల భూములు: వక్ఫ్, దేవాదాయ, భూదాన్ బోర్డులకు చెందిన భూముల వివరాలు.
సీలింగ్ భూములు: భూ గరిష్ట పరిమితి చట్టం కింద ప్రభుత్వానికి దఖలుపడిన మిగులు భూముల వివరాలు.
భూసేకరణ: వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం సేకరించి, ప్రభుత్వ ఖాతాలో చేరిన భూముల వివరాలు, వాటి నోటిఫికేషన్లు. ఈ సమగ్ర సమాచార సేకరణ ద్వారా ప్రభుత్వ భూములకు పటిష్టమైన రక్షణ కవచం ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో కబ్జాలకు ఆస్కారం లేకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


