Medaram Jatara Govt Releases Rs.150 Crores Funds: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆత్మీయతకు ప్రతీకగా “గిరిజనుల కుంభమేళా”గా ప్రసిద్ధి చెందిన ఈ మహోత్సవం కోసం ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. జాతర జరిగే రోజులతో పాటు శాశ్వత మౌలిక సదుపాయాల ఏర్పాటుకై రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి అవసరాలపై ఖర్చు చేయడానికి గిరిజన సంక్షేమశాఖ ద్వారా రూ.150 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఈ జాతర ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా వైభవంగా జరగనుందని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈ సారి లక్షలాది మంది భక్తులు దేశ నలుమూలల నుంచి మేడారం చేరుకుంటారని అధికార యంత్రాంగం భావిస్తోంది. దీంతో ప్రభుత్వం ముందుగానే అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా రోడ్ల విస్తరణ, సురక్షితమైన తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్, శుభ్రత తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక వైద్య శిబిరాలు, స్పెషల్ ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ, పటిష్ఠమైన శానిటేషన్ ఏర్పాట్లు చేయనున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) స్వాగతించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
“ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆదివాసీలకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. సమ్మక్క-సారలమ్మ జాతర కోసం రూ.150 కోట్లు మంజూరు చేయడం ఈ ప్రభుత్వానికి గిరిజన ఆచారాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈసారి జాతర చారిత్రాత్మకంగా, మరింత వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు దేశంలోని ఇతర ప్రదేశాల నుంచి హాజరై సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంటారు. దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగగా గుర్తించబడింది. ప్రభుత్వం కేటాయించిన నిధుల ద్వారా ఈసారి జాతరలో పాల్గొనే భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం లభించనుంది. ఈ నిర్ణయం ద్వారా గిరిజన సంప్రదాయాల పరిరక్షణకు, పండుగ ప్రతిష్టను మరింత పెంచడానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.


