Evening snacks scheme for government schools : పదో తరగతి… విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. ఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నా, సాయంత్రం వేళకు విద్యార్థుల కడుపులు నకనకలాడుతున్నాయి. ఈ ఆకలి వారి ఏకాగ్రతను దెబ్బతీస్తోందన్న ఆందోళనల నడుమ, సర్కారు ఓ చక్కటి పరిష్కారంతో ముందుకొచ్చింది. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన చిరుతిండి అందించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.
ఎందుకీ నిర్ణయం? విద్యార్థుల ఇబ్బందులే కారణం : గతంలో పదో తరగతి పరీక్షలకు కేవలం 35-40 రోజుల ముందు మాత్రమే ప్రత్యేక తరగతులు నిర్వహించి, చిరుతిండి అందించేవారు. కానీ ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో దసరా సెలవుల తర్వాత నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరగడంతో, సుదూర గ్రామాల విద్యార్థులు ఇళ్లకు చేరేసరికి రాత్రి 7 గంటలు దాటుతోంది. మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేసిన విద్యార్థులు, ఆ తర్వాత ఏమీ తినకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన పాఠశాల విద్యాశాఖ, విద్యార్థుల ఆకలి తీర్చి, చదువుపై శ్రద్ధ పెంచేందుకు ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు : పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, ఈ పథకానికి సంబంధించిన దస్త్రాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. ఈ ప్రతిపాదనల ప్రకారం..
ప్రారంభం: నవంబరు నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.
లబ్ధిదారులు: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,600 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 194 మోడల్ స్కూళ్లలో చదువుతున్న లక్షా 90 వేల మంది పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయాలని అంచనా వేశారు.
మెనూలో ఏముంది? రుచితో పాటు ఆరోగ్యం : కేవలం కడుపు నింపడమే కాకుండా, విద్యార్థులకు అవసరమైన పోషకాలను అందించేలా మెనూను రూపొందించారు. వారంలో రోజుకొక రకం చొప్పున కింది వాటిని అందించాలని ప్రతిపాదించారు.
ఉడకబెట్టిన పెసలు, బొబ్బర్లు లేదా శనగలు
పల్లీలు-బెల్లంతో చేసిన చిక్కీలు
చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు
ఉల్లిపాయ పకోడి
భవిష్యత్ ప్రణాళిక: బడిలో ఉదయం అల్పాహారం : ఈ సాయంత్రం చిరుతిండి పథకమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం అందించే బృహత్తర పథకానికి కూడా విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనకు అనుగుణంగా, 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయడానికి అధికారులు సమగ్ర నివేదికను సిద్ధం చేశారు.
అంచనా వ్యయం: సుమారు 25 వేల పాఠశాలల్లోని 17.50 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఏటా రూ.400 కోట్లు అవసరమవుతాయని అంచనా.
లక్ష్యాలు: ఈ పథకం ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెంచడం, వారిలో పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రధాన లక్ష్యాలు. ఈ పథకాలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది.


