Minimum age for Grade 1 admission : మీ పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించాలనుకుంటున్నారా..? అయితే, ఇకపై వారికి ఆరేళ్లు నిండే వరకు ఆగాల్సిందే! తెలంగాణలో పాఠశాల విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ, రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశానికి కనీస వయసును ఐదేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచాలని, అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని గట్టిగా సూచించింది.
ఎందుకీ ఆరేళ్ల నిబంధన : ప్రస్తుతం రాష్ట్రంలో ఐదేళ్లు నిండితే ఒకటో తరగతిలో చేర్చుకుంటున్నారు. అయితే, ఈ వయసులో పిల్లలపై సిలబస్ భారం మోపడం వారి మానసిక వికాసానికి మంచిది కాదని, వారికి ఆటపాటలతో కూడిన విద్యే అవసరమని కమిషన్ అభిప్రాయపడింది.
జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు: దేశంలోని అధిక శాతం రాష్ట్రాలు, సీబీఎస్‌ఈ, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ బోర్డులు, అమెరికా, జపాన్, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఆరేళ్ల నిబంధననే పాటిస్తున్నాయి.
మానసిక పరిపక్వత: ఆరేళ్ల వయసులో పిల్లలు ప్రాథమిక విద్యకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉంటారని, అప్పుడే వారు పాఠ్యాంశాలను సులభంగా గ్రహించగలరని నివేదికలో పేర్కొంది.
ప్రభుత్వ బడుల్లోనూ ‘ప్రీ-ప్రైమరీ’ : ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ప్రవేశాలు ఉండటంతో, చాలామంది తల్లిదండ్రులు మూడేళ్లకే తమ పిల్లలను ప్రైవేట్ ప్లే స్కూళ్లలో, నర్సరీలలో చేర్పిస్తున్నారు. ఆ తర్వాత, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఇష్టపడటం లేదు.
“ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించకపోతే, అణగారిన వర్గాల పిల్లలు నాణ్యమైన పునాది విద్యకు దూరమవుతారు.”
– తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక
అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా, అక్కడ శిశు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదని, అందుకే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలను ప్రారంభించాలని కమిషన్ బలంగా సిఫార్సు చేసింది.
కమిషన్ ప్రధాన సిఫారసులు : జూన్ 1వ తేదీ నాటికి ఆరేళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించాలి. మూడేళ్లు నిండితే నర్సరీలో, నాలుగేళ్లు నిండితే ఎల్‌కేజీలో చేర్చుకోవాలి. ఈ కనీస వయసు నిబంధన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, అన్ని బోర్డులకు వర్తింపజేయాలి. ఈ సిఫారసులను ప్రభుత్వం ఆమోదిస్తే, తెలంగాణ విద్యా వ్యవస్థ జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మారడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడనుంది.


