Telangana Judicial Appointments: తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో గురువారం నూతనోత్తేజం వెల్లివిరిసింది. నలుగురు నూతన అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన వారు, నేడు భాద్యతలు స్వీకరించడంతో న్యాయవ్యవస్థ మరింత బలోపేతమైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులుగా ఎదిగిన వీరి నియామకంతో, కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని న్యాయవాద వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ, కొత్తగా కొలువుదీరిన ఈ నలుగురు న్యాయమూర్తులు ఎవరు..? వారి నేపథ్యం ఏమిటి..? ఈ నియామకాలతో హైకోర్టు బలం ఎంతకు చేరింది..?
ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవం:
హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో గురువారం ఉదయం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నూతన న్యాయమూర్తులు జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌లతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్, బార్ కౌన్సిల్ ఛైర్మన్, సీనియర్ న్యాయవాదులు, హైకోర్టు అధికారులు హాజరై నూతన న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త న్యాయమూర్తుల నేపథ్యం: న్యాయవాదుల కోటాలో భాగంగా ఈ నలుగురిని అదనపు న్యాయమూర్తులుగా నియమించారు.
జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్: హైదరాబాద్‌లోని బాలానగరుకు చెందిన ఈయన, నెల్లూరులో న్యాయశాస్త్ర పట్టా పొందారు.ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌ఎం పూర్తిచేసి, తెలంగాణ బార్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/telangana-high-court-notice-sigachi-explosion/
జస్టిస్ సుద్దాల చలపతిరావు: 1998లో న్యాయవాదిగా నమోదు చేసుకున్న ఈయన, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2022లో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు.
జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి: యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన ఈయన కూడా 1998లో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. రెవెన్యూ కేసుల్లో అపార అనుభవం ఉన్న ఈయన, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు.
జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన ఈయన, ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు.ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ, ఎల్ఎల్‌ఎం పూర్తిచేశారు.
పెరిగిన న్యాయమూర్తుల సంఖ్య:
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 28న ఆమోదముద్ర వేయడంతో వీరి నియామక ప్రక్రియ పూర్తయింది. ఈ నలుగురి నియామకంతో, తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 30కి పెరిగింది.మంజూరైన పోస్టుల సంఖ్య 42 కాగా, ఇంకా 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కొత్త న్యాయమూర్తుల రాకతో హైకోర్టులో కేసుల విచారణ వేగవంతం అవుతుందని న్యాయవాదులు మరియు కక్షిదారులు ఆశిస్తున్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించి, ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో ఈ నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.


