High-interest rate scams targeting middle class : నూటికి పది రూపాయల వడ్డీ.. వినడానికే ఎంత ఆశ పుడుతుందో! కష్టపడి కూడబెట్టిన సొమ్మును రెట్టింపు చేసుకోవాలనే ఆశే, ఇప్పుడు అమాయక ప్రజల పాలిట ఉరితాడుగా మారుతోంది. నమ్మకంగా మాటలు చెప్పి, మొదట్లో కాస్త వడ్డీ ఎరవేసి, రూ.కోట్లకు పడగలెత్తగానే జెండాలు పీకేస్తున్న బడా బాబుల మోసాలు తెలంగాణలో పెచ్చుమీరుతున్నాయి. తాండూరు నుంచి నల్గొండ వరకు ఎందరో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నమ్మించి.. నట్టేట ముంచుతున్నారు : ఈ అధిక వడ్డీ మోసాల తీరు దాదాపు అన్నిచోట్లా ఒకేలా ఉంటోంది.
లక్ష్యం: చిరు వ్యాపారులు, మధ్య తరగతి ఉద్యోగులు, గృహిణులే వీరి ప్రధాన లక్ష్యం. వీరి ఆర్థిక అవసరాలు, అధిక డబ్బు సంపాదించాలనే ఆశను ఆసరా చేసుకుంటారు.
ఎర: “నెలకు నూటికి రూ.10 వడ్డీ ఇస్తాం” అంటూ నమ్మబలుకుతారు. బ్యాంకులు ఇచ్చే వడ్డీ కన్నా ఇది పది రెట్లు ఎక్కువ కావడంతో, జనం తేలిగ్గా ఆకర్షితులవుతారు.
నమ్మకం: చెప్పినట్లుగానే మొదటి రెండు, మూడు నెలలు వడ్డీని సమయానికి చెల్లిస్తారు. దీంతో నమ్మకం కుదిరి, బాధితులు తమకు తెలిసినవారిని కూడా ఇందులో చేర్పిస్తారు. మరికొందరు తమ చీటీ డబ్బులను సైతం వారికే అప్పగిస్తారు.
పలాయనం: ఇలా లక్షల్లో మొదలైన లావాదేవీలు రూ.కోట్లకు చేరగానే, నిర్వాహకులు రాత్రికి రాత్రే ఉన్నదంతా ఊడ్చుకుని ఊరు విడిచి ఉడాయిస్తారు.
తాండూరులో తాండవిస్తున్న మోసాలు : వ్యాపార కేంద్రమైన తాండూరులో ఈ తరహా మోసాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఓ వైద్య దుకాణం యజమాని, చిట్టీల వ్యాపారం పేరుతో సుమారు రూ.10 కోట్లకు పైగా వసూలు చేసి చెప్పాపెట్టకుండా పరారయ్యాడు. రెండు సంస్థలు అధిక వడ్డీ, చిట్టీల డబ్బులను ఎగ్గొట్టి చేతులెత్తేశాయి. ఒక్కో కుటుంబం రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నష్టపోయింది. పోలీసులను ఆశ్రయించినా ఫలితం శూన్యం.
ఓ ప్రముఖ కంపెనీ ఏజెన్సీ నడిపిన వ్యాపారి, తెలిసిన వారి వద్ద రూ.3 కోట్లు అప్పు చేసి, కోర్టును ఆశ్రయించి రక్షణ పొందాడు. మూడేళ్లు గడిచినా బాధితులకు చిల్లిగవ్వ దక్కలేదు.
“చిట్టీ ముగిశాక వచ్చిన రూ.5 లక్షలు నిర్వాహకుడికే ఇచ్చాను. వచ్చే వడ్డీతో మరో చీటీ నడుస్తుందని, రెండేళ్లలో రూ.10 లక్షలు వస్తాయని నమ్మాను. ఆ డబ్బుతో కుమార్తె వివాహం చేయాలనుకున్నా. ఇప్పుడు ఆయన ముఖం చాటేశాడు. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.”
– వెంకట కృష్ణ, బాధితుడు, తాండూరు.
రక్షణ కవచం ఇదే : అధిక వడ్డీ ఆశ చూపేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విశ్రాంత పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
“డబ్బు దాచుకోవాలన్నా, భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేసుకోవాలన్నా బ్యాంకులు, ప్రభుత్వ గుర్తింపు పొందిన, విశ్వసనీయమైన చిట్ ఫండ్ సంస్థలను ఆశ్రయించడం శ్రేయస్కరం. పెద్ద సంస్థలు సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారుల వద్ద చిట్టీ మొత్తాన్ని డిపాజిట్ చేస్తాయి. ఆ శాఖ తరచూ లావాదేవీలను పర్యవేక్షిస్తుంది. అందువల్ల దాచుకున్న డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది.”
– ఓ విశ్రాంత పోలీసు అధికారి.
అత్యాశకు పోయి అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనుకుంటే, ఉన్నది కూడా ఊడ్చుకుపోవడం ఖాయం. కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే, చట్టబద్ధమైన, నమ్మకమైన ఆర్థిక సంస్థలలోనే మదుపు చేయడం ఒక్కటే మార్గం.


