Indiramma Housing Scheme Irregularities: పేదల సొంతింటి కలను నీరుగార్చాలని చూస్తే కుదరదు. ప్రభుత్వ పథకాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకు పాల్పడిన అనర్హులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
తెలంగాణలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’లో అవకతవకలు వెలుగుచూశాయి. అర్హులకు మాత్రమే పథకం ఫలాలు అందాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని దెబ్బతీస్తూ, కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అనర్హులు లబ్ధి పొందినట్లు తేలింది. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం, క్షేత్రస్థాయి తనిఖీల్లో పట్టుబడిన సుమారు 1,950 మంది అనర్హులకు మంజూరు చేసిన ఇళ్లను తక్షణమే రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
అక్రమాలు వెలుగులోకి వచ్చిందిలా:
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆగస్టు 15 నాటికి భారీ ఎత్తున గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, ఈ అక్రమాలు బయటపడటం కలకలం రేపింది. హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు నిర్వహించిన వెరిఫికేషన్‌లో భాగంగా, కొందరు లబ్ధిదారులు నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైనట్లు గుర్తించారు.
ALSO READ:https://teluguprabha.net/telangana-news/yadadri-power-plant-first-unit-inauguration-telangana/
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ అనర్హుల్లో చాలామంది గతంలోనే బేస్‌మెంట్ స్థాయి వరకు ఇళ్లను నిర్మించుకున్నవారే. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో సరిగా పరిశీలించకుండా, వారు అప్‌లోడ్ చేసిన పాత ఫోటోల ఆధారంగానే వీరికి ఇళ్లు మంజూరయ్యాయి. బేస్‌మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత, తొలి విడత సాయం కింద రూ. లక్ష చెల్లించే సమయంలో ఈ మోసం వెలుగులోకి వచ్చినట్లు ఎండీ గౌతమ్ తెలిపారు.మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పటికే ఆర్‌సీసీ ఇళ్లు ఉన్నవారు కూడా అనర్హుల జాబితాలో ఉన్నట్లు తనిఖీల్లో తేలింది.
ప్రభుత్వం తక్షణ చర్యలు:
ఈ అక్రమాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అనర్హులుగా తేలిన 1,950 మందికి కేటాయించిన ఇళ్లను వెంటనే రద్దు చేసింది. వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ అక్రమాలకు బాధ్యులైన పంచాయతీ కార్యదర్శులపై వేటు వేస్తూ, వారిని సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అర్హులకే పట్టం.. పారదర్శకతే లక్ష్యం:
మొదటి విడతలో సొంత జాగా ఉండి, ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని ఎండీ గౌతమ్ పునరుద్ఘాటించారు.పథకం అమలులో ఎక్కడా అవకతవకలకు తావులేకుండా, దశలవారీగా పలు స్థాయిల్లో పరిశీలన జరిపిన తర్వాతే కలెక్టర్ ఆమోదంతో లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తున్నామని ఆయన వివరించారు. అయినప్పటికీ, కొందరి అలసత్వం వల్ల జరిగిన ఈ తప్పులను సరిదిద్ది, నిజమైన అర్హులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


