Sunday, November 16, 2025
HomeతెలంగాణIndiramma housing : ఇందిరమ్మ ఇంటికి 'ఉపాధి' అండ... 90 రోజుల కూలీ డబ్బులు ఇక...

Indiramma housing : ఇందిరమ్మ ఇంటికి ‘ఉపాధి’ అండ… 90 రోజుల కూలీ డబ్బులు ఇక లబ్ధిదారుడికే!

Indiramma housing linked with MGNREGS : సొంతింటి కలను సాకారం చేసుకుంటున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో అద్భుతమైన శుభవార్త అందించింది. ఇప్పటికే రూ.5 లక్షల ఆర్థిక సాయం, తక్కువ ధరకే ఇసుక అందిస్తున్న సర్కార్, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, ఇంటి నిర్మాణ పనులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (MGNREGS) అనుసంధానించింది. దీనివల్ల లబ్ధిదారులకు అదనంగా మరో రూ.27 వేలకు పైగా ప్రయోజనం చేకూరనుంది. అసలు ఏమిటీ అనుసంధానం…? దీనివల్ల లబ్ధిదారుడికి కలిగే ప్రయోజనాలేంటి..?

- Advertisement -

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కూలీల కొరత, అధిక వ్యయాలతో లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను, ఉపాధి హామీ పథకంలో భాగంగా పరిగణిస్తూ, పంచాయతీరాజ్ శాఖ గురువారం అధికారికంగా ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.

లబ్ధిదారుడికి ఎలా ప్రయోజనం : ఈ కొత్త విధానం వల్ల, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి ద్వంద్వ ప్రయోజనం కలుగుతుంది.
90 రోజుల పనిదినాలు: జాబ్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి, వారి ఇంటి నిర్మాణంలో 90 రోజుల పాటు పని కల్పిస్తారు.
రూ.27,630 అదనపు లబ్ధి: ప్రస్తుతం ఉపాధి హామీ కూలీ రోజుకు రూ.307. ఈ లెక్కన, 90 రోజులకు గాను, లబ్ధిదారుడికి సుమారు రూ.27,630 అదనంగా అందుతాయి. ఈ డబ్బును ఇంటి నిర్మాణానికి అదనపు పెట్టుబడిగా వాడుకోవచ్చు.

దశలవారీగా పనులు: బేస్‌మెంట్ స్థాయి వరకు 40 పనిదినాలు, స్లాబ్ స్థాయి వరకు 50 పనిదినాలను ఈ పథకం కింద వినియోగించుకోవచ్చు.
పారదర్శకంగా అమలు : ఈ పథకం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం పక్కాగా నిబంధనలను రూపొందించింది. ఎంపీడీవోలు ఇందిరమ్మ ఇళ్ల అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల నుంచి అనుమతి పొందాలి.
ఇంటి నిర్మాణం మూడు దశల్లో ఉన్నప్పుడు (పునాది, స్లాబ్, పూర్తి), లబ్ధిదారుడి ఫోటోతో సహా పనుల ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. పనులు పూర్తయ్యాక, పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి, చెల్లింపులకు అనుమతిస్తారు. ఈ వివరాలను పంచాయతీ నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలి.

ఈ నిర్ణయంతో, లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కలగడమే కాకుండా, నిర్మాణ పనులు కూడా వేగవంతంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు, ఇటీవల సిమెంట్, స్టీల్‌పై జీఎస్టీ తగ్గడంతో, లబ్ధిదారులపై నిర్మాణ భారం మరింత తగ్గనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad