Polavaram- Banakacherla Link Project: తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఉందని.. ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా ఆపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా నిలువరించాలని కేంద్ర జల శక్తి కార్యదర్శికి రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. బనకచర్ల లింకు ప్రాజెక్టు విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినట్లు లేఖలో రాహుల్ బొజ్జా ప్రస్తావించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/youth-social-media-addiction-reels-career-impact-survey/
డీపీఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని.. ఈ టెండర్‌ను ఆపేయాలని రాహుల్ బొజ్జా లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా.. నిబంధనలు, విభజన చట్టానికి వ్యతిరేకంగా రూపొందిస్తున్న పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టుకు భూ సర్వే చేపట్టకుండా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.
కాగా, పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పోలవరం – బనకచర్ల విషయంలో టెండర్ ప్రక్రియ, భూసేకరణ విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/10-lakh-kidney-and-cancer-cases-registered-in-telangana/
ఇటీవలే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించబోమని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు.


