Local body election reform : ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్నారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని మదనపడుతున్నారా? ఇక ఆ చింత అవసరం లేదు. దాదాపు 30 ఏళ్లుగా అమల్లో ఉన్న ‘ఇద్దరు సంతానం’ నిబంధనకు స్వస్తి పలకాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని, రానున్న పంచాయతీ ఎన్నికల్లోనే దీనిని అమలు చేసేందుకు మార్గం సుగమం చేస్తోంది. అసలు ఈ కీలక నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటి..? ఈ ప్రక్రియ ఎలా సాగనుంది..?
ఆర్డినెన్స్‌తో అడ్డంకులు దూరం : స్థానిక సమరంలో ఎక్కువ మందికి అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది.
కేబినెట్ తుది నిర్ణయం: ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను తొలగించాలని ఈనెల 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్, పురపాలక శాఖలు చట్టసవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే దస్త్రంపై సంతకం చేశారు.
ఆర్డినెన్స్ ఎందుకు : ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు కాబట్టి, చట్టసవరణకు ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించనున్నారు.
గవర్నర్ ఆమోదమే తరువాయి: కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత, ముసాయిదా ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది.
30 ఏళ్ల నిబంధనకు తెర : కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే ఉద్దేశంతో, ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చేయరాదన్న నిబంధనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇది కొనసాగుతోంది. అయితే, మారిన సామాజిక పరిస్థితులు, ప్రజల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో ఈ నిబంధనను సమీక్షించాలని ప్రభుత్వం భావించింది.
పొరుగు రాష్ట్రం స్ఫూర్తి: గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఈ నిబంధనను తొలగిస్తూ చట్ట సవరణ చేశారు.
నివేదికల పరిశీలన: రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ, సంతానోత్పత్తి రేటుపై పంచాయతీరాజ్, పురపాలక శాఖలు సమర్పించిన నివేదికలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
రానున్న ఎన్నికల్లోనే అమలుకు అవకాశం : ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. న్యాయస్థానం సూచనల మేరకు ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే, ఎన్నికల సంఘం మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ లోపు గవర్నర్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపితే, కొత్త నోటిఫికేషన్ నుంచే ఈ సడలింపును అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో రానున్న పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనే ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు అర్హత సాధిస్తారు.


