Supreme Court’s Verdict on Medical Admissions: తెలంగాణలో రాష్ట్ర కోటా కింద మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 33ను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ తీర్పుతో వైద్య విద్య అడ్మిషన్లలో స్థానికతపై నెలకొన్న వివాదానికి దాదాపుగా తెరపడింది.
తెలంగాణలో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు చదువుకున్న విద్యార్థులు మాత్రమే రాష్ట్ర కోటా కింద మెడికల్ అడ్మిషన్లకు అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఈ జీవోను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
ఈ తీర్పు స్థానిక విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఉంది. కొంతమంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా తాత్కాలికంగా ఇతర రాష్ట్రాలకు లేదా విదేశాలకు వెళ్లి చదువుకొని, తిరిగి తెలంగాణ వచ్చి స్థానిక కోటా కావాలని కోరారు. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, స్థానిక అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఈ తీర్పుతో మెడికల్ ప్రవేశాల ప్రక్రియ మరింత సులభతరం కానుంది.


