Telangana Medical Students Demands : “ప్రజల ప్రాథమిక హక్కు – ప్రభుత్వాల కనీస బాధ్యత”.. ఇది కేవలం నినాదం కాదు, తెలంగాణ వైద్యకీయ యువజన సంఘం లేవనెత్తుతున్న బలమైన వాదన. రాష్ట్రంలో వైద్య విద్య, ప్రజారోగ్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని, ప్రభుత్వాలు మారినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదని ఆ సంఘం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రైవేటు కళాశాలల దోపిడీ, నాణ్యత లేని విద్య, వైద్యుల హక్కుల హరణ వంటి సమస్యలపై గళమెత్తింది. ఇంతకీ వారి ప్రధాన డిమాండ్లు ఏమిటి? ప్రభుత్వం ముందు వారు ఉంచుతున్న పరిష్కారాలేంటి? వారి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది..?
క్షీణిస్తున్న వైద్య విద్య.. ప్రమాదంలో ప్రజారోగ్యం : దేశంలోనే వైద్య విద్యకు ప్రసిద్ధిగాంచిన తెలంగాణలో, ప్రస్తుతం నాణ్యమైన విద్య కరువైందని, ప్రజారోగ్య వ్యవస్థ నిర్వీర్యమవుతోందని తెలంగాణ వైద్యకీయ యువజన సంఘం ఆరోపించింది.
ప్రైవేటుదే హవా: రాష్ట్రంలోని 80% మంది విద్యార్థులు ప్రైవేట్ వైద్య కళాశాలల్లోనే చదువుతున్నారని, అక్కడ అధిక ఫీజులు, నాణ్యత లేని బోధనతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోందని వారు పేర్కొన్నారు.
నాణ్యతాలోపం: అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన వైద్య విద్య నాణ్యత అత్యంత దయనీయంగా ఉందని, కనీస మౌలిక వసతులు, సరైన బోధనా సిబ్బంది లేకపోవడం వంటి సమస్యలు వ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని వారు విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం: ప్రభుత్వాలు ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టకుండా, కార్పొరేట్ ఆసుపత్రులకు పెద్దపీట వేస్తున్నాయని, దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ముందు తెలంగాణ యువజన సంఘం డిమాండ్లు : ఈ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ వైద్యకీయ యువజన సంఘం ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచింది.
నాణ్యమైన విద్య: పేద విద్యార్థులందరికీ ఉచితంగా, నాణ్యమైన వైద్య విద్యను అందించాలి.
రిజర్వేషన్ల పెంపు: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి వైద్య విద్యలో రిజర్వేషన్లు పెంచాలి.
ప్రైవేట్ ఫీజుల నియంత్రణ: ప్రైవేట్ ఫీజులను నియంత్రించి, మౌలిక వసతులు లేని కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి.
ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచి, ప్రజారోగ్య పరిరక్షణను ప్రభుత్వ బాధ్యతగా గుర్తించాలి.
విద్యార్థులపై వేధింపుల నివారణ: వైద్య విద్యార్థులపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలి.
వైద్యుల నియామకాలు: కార్పొరేట్ పెత్తనాన్ని తగ్గించి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పారదర్శకంగా వైద్యులను నియమించాలి.
NMC, PCPNDT చట్టాల సవరణ: వైద్యులకు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలను సవరించాలి.
పనిగంటల తగ్గింపు: వైద్యులపై పనిభారాన్ని తగ్గించి, వారికి కనీస వేతనాలు, భద్రత కల్పించాలి.
భవిష్యత్ కార్యాచరణ.. సెమినార్‌కు పిలుపు : ఈ డిమాండ్ల సాధన కోసం, ప్రజల్లో, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి నవంబర్ 17, 2025న ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సెమినార్‌ను నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైద్యులు, మేధావులు ఈ సెమినార్‌లో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.


