Saturday, November 15, 2025
HomeతెలంగాణRural poultry : పల్లెల్లో ఇక కోళ్ల కూత.. ఇంటింటా ఆదాయపు పూత!

Rural poultry : పల్లెల్లో ఇక కోళ్ల కూత.. ఇంటింటా ఆదాయపు పూత!

Rural poultry farming scheme : ఒకప్పుడు పల్లె పెరడంటే నాటుకోళ్ల సందడే. కానీ కాలక్రమంలో ఆ చప్పుళ్లు తగ్గాయి. మరోవైపు నగరాల్లో నాటుకోడి మాంసానికి గిరాకీ మాత్రం అమాంతం పెరిగింది. ఈ తరుణంలో, తగ్గుతున్న కోళ్ల సంఖ్యకు, పెరుగుతున్న డిమాండ్‌కు మధ్య వారధి నిర్మిస్తూ, గ్రామీణ మహిళలు, రైతులకు అదనపు ఆదాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘తిన్నవారికి ప్రొటీన్లు, పెంచిన వారికి ఆదాయం’ అనే నినాదంతో ముందుకు వస్తున్న ఈ పథకం స్వరూపమేంటి? ఇది పల్లె బతుకు చిత్రాన్ని ఎలా మార్చబోతోంది?

- Advertisement -

ప్రభుత్వ బృహత్తర కార్యాచరణ : గ్రామాల్లో యువతకు, మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. జాతీయ పశుగణన గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో 2014లో 8,20,134గా ఉన్న నాటుకోళ్ల సంఖ్య, 2025 నాటికి 5,10,552కి తగ్గినట్లు అంచనా. ఈ వ్యత్యాసాన్ని అధిగమించి, ప్రతి గ్రామంలో ఉచితంగా కోళ్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. వ్యవసాయ, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, ఉద్యాన, పంచాయతీరాజ్ శాఖలతో పాటు విశ్వవిద్యాలయాలను భాగస్వాములను చేస్తూ ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ముఖ్యంగా దళిత, గిరిజన కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికే ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ములుగు, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో ఆరు వేల చొప్పున నాటుకోళ్లను పంపిణీ చేశారు.

ఉపాధి హామీతో చేయూత.. రాయితీలతో ప్రోత్సాహం : రైతులు తమ పెరట్లో లేదా వ్యవసాయ క్షేత్రాల్లో తక్కువ పెట్టుబడితో కోళ్ల షెడ్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోంది.
షెడ్ల నిర్మాణం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద షెడ్లను నిర్మించుకోవచ్చు.
మదర్ యూనిట్’: పెద్ద షెడ్ (మదర్ యూనిట్) నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. ఇక్కడ పెంచిన కోడిపిల్లలను గ్రామంలోని ఇతర పెంపకందారులకు అందిస్తారు.
చిన్న యూనిట్లు: చిన్న యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష వరకు సాయం అందిస్తారు.
రుణ సౌకర్యం: రాయితీపై కోళ్లను అందించడంతో పాటు, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా సులభంగా రుణాలు కల్పిస్తారు.

“నెలకి రూ.50 వేల ఆదాయం!”
“నాకు ఎకరం భూమి ఉంది, అందులో మిర్చి పండిస్తున్నా. ఉపాధి హామీ పథకం కింద రూ.3 లక్షలతో మదర్ యూనిట్ షెడ్ నిర్మించుకున్నాను. ప్రస్తుతం 500 నాటు కోడి పిల్లలను పెంచుతున్నాను. అన్ని ఖర్చులు పోను నెలకు సుమారు రూ.50 వేల వరకు ఆదాయం వస్తోంది. కుటుంబ ఖర్చులు సులభంగా గడిచిపోతున్నాయి.”
– వలస శివ, శంకరరాజుపల్లి, ములుగు జిల్లా

మహిళా శక్తికి కొత్త బలం : ఈ పథకం మహిళా సంఘాలకు వరంలా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ‘మహిళాశక్తి’ పథకం కింద ప్రతి మండలానికి రెండు పెద్ద యూనిట్లు, వంద చిన్న యూనిట్లను మంజూరు చేస్తోంది. దీనికి అవసరమైన రుణాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) అందజేస్తుంది. ఇంటి వద్దే ఉంటూ తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఉండటంతో మహిళలు నాటుకోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌లో నాటుకోడి మాంసానికి ఉన్న అధిక డిమాండ్ వారికి కలిసొచ్చే అంశం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad