Saturday, November 15, 2025
HomeతెలంగాణRation Dealers: మా కడుపు కొడితే.. మీ సన్న బియ్యం బంద్.. ప్రభుత్వానికి రేషన్ డీలర్ల...

Ration Dealers: మా కడుపు కొడితే.. మీ సన్న బియ్యం బంద్.. ప్రభుత్వానికి రేషన్ డీలర్ల అల్టిమేటం!

Telangana ration dealers’ demands : నిరుపేదలకు ఆకలి తీర్చే అన్నపూర్ణలుగా భావించే రేషన్ దుకాణాల చుట్టూ ఇప్పుడు ఆందోళన మేఘాలు అలుముకున్నాయి. నెలల తరబడి కమీషన్ బకాయిలు పేరుకుపోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. “మాకు రావలసిన డబ్బులు చెల్లించకపోతే, వచ్చే నెల నుంచి సన్న బియ్యం పంపిణీని నిలిపివేస్తాం” అని తేల్చిచెప్పారు. అసలు డీలర్ల డిమాండ్లు ఏంటి..? ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఎన్ని కోట్లు..? ఈ వివాదం పేదల కడుపుపై ఎలాంటి ప్రభావం చూపనుంది..?

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘సన్న బియ్యం’ పథకానికి, క్షేత్రస్థాయిలో పంపిణీ వ్యవస్థగా ఉన్న రేషన్ డీలర్ల నుంచే నిరసన సెగ తగులుతోంది. 

- Advertisement -

పెండింగ్‌లో రూ.100 కోట్ల బకాయిలు : ప్రభుత్వం తమకు గత 5 నెలలుగా కమీషన్ చెల్లించడం లేదని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ బకాయిలు, గన్నీ బ్యాగుల బిల్లులు కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.100 కోట్లకు పైగా పేరుకుపోయాయని డీలర్ల సంక్షేమ సంఘం చెబుతోంది. “బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి దుకాణాల అద్దెలు, పనివారి జీతాలు చెల్లిస్తున్నాం. మాకు రావాల్సిన డబ్బుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది” అని హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టిన డీలర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

కష్టానికి ప్రతిఫలం కరవు : వర్షాకాలం నేపథ్యంలో జూన్‌లో ప్రభుత్వం మూడు నెలల (జూన్, జులై, ఆగస్టు) సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది. “రాత్రి ఒంటి గంట వరకు సర్వర్లు మొరాయించినా, అదనపు సిబ్బందిని పెట్టుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మూడు నెలల రేషన్‌ను విజయవంతంగా పంపిణీ చేశాం. మేం చేసిన కష్టానికి ప్రతిఫలంగా కమీషన్ అడిగితే, మమ్మల్ని ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు” అని డీలర్లు వాపోతున్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలు ఏమయ్యాయి : కేవలం బకాయిల చెల్లింపే కాదు, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా, డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని, కమీషన్ పెంచాలని, ఇతర హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తుచేస్తున్నారు.

సెప్టెంబర్ 1 నుంచి బంద్ హెచ్చరిక : తమ డిమాండ్ల సాధన కోసం డీలర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు, జిల్లా పౌరసరఫరాల అధికారులకు (డీసీఓ), ఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. ఈనెల 31వ తేదీలోగా తమ బకాయిలు చెల్లించి, హామీలపై స్పష్టమైన ప్రకటన చేయని పక్షంలో, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సన్న బియ్యం పంపిణీని పూర్తిగా బహిష్కరిస్తామని, రేషన్ షాపుల బంద్ పాటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వం బియ్యంతో పాటు ప్రత్యేక రేషన్ బ్యాగులను కూడా పంపిణీ చేయాలని భావిస్తున్న తరుణంలో డీలర్ల సమ్మె హెచ్చరిక ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad