Telangana Shooter Dhanush Srikanth To Get Rs 1 Crore 20 Lakh Reward: తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం, శ్రీకాంత్‌కు కోటి 20 లక్షల రూపాయల నజరానా ఇస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. నేడు (ఆదివారం) హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో క్రీడలు, యువజన శాఖా మంత్రి వాకిటి శ్రీహరి ఈ ప్రకటన చేశారు. టోక్యోలో జరుగుతున్న డెఫ్లంపిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ తన అద్భుతమైన ఆటతీరుతో గోల్డ్ మెడల్ సాధించాడు. పురుషుల విభాగంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీలో ధనుష్ శ్రీకాంత్ ఈ ఘనత దక్కించుకున్నాడు. తెలంగాణకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ జర్మనీ సుహల్‌లో 2023లో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో బంగారం పతకాన్ని సాధించాడు. వీటితో పాటు 2024 సెప్టెంబర్‌లో వరల్డ్ డెఫ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ నుంచి మూడో గోల్డ్ సాధించిన ఘూటర్‌గా నిలిచాడు. జర్మనీలోని హనోవెర్‌లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్‌టీమ్ ఫైనల్లో శ్రీకాంత్–మోహిత్ సంధు 17–5 స్కోరుతో ఇండియాకే చెందిన నటాషా జోషి–మొహమ్మద్ మూర్తజాపై గెలిచింది. నటాషా, మూర్తజాకు సిల్వర్ లభించింది. కాగా, ధనుష్ ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లోనూ గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నాడు. ఈ గోల్డ్ మెడల్ ద్వారా రికార్డు తిరగరాశాడు.
ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపించిన షూటర్..
కాగా, పుట్టుకతోనే వినికిడి సమస్యతో జన్మించిన ధనుశ్ ఏనాడు నిరాశకు లోనుకాలేదు. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని చేతల్లో చూపిస్తూ షూటింగ్‌లో రాణిస్తున్నాడు. ఇటీవలే జర్మనీలో జరిగిన ప్రపంచ డెఫ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన ధనుశ్ తాజాగా డెప్లంపిక్స్‌లోనూ తన ఆటతీరుతో స్వర్ణం గెలుచుకున్నాడు. పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్లు పసి ప్రాయం నుంచే ధనుశ్ క్రీడల పట్ల అమితాసక్తి ప్రదర్శించాడు. స్కూల్‌లో నిర్వహించే ప్రతీ క్రీడాపోటీల్లో పతకంతో వచ్చేవాడు. అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు మూడో తరగతిలో ఉన్నప్పుడే తైక్వాండోలో చేర్పించారు. ఇంట్లో సరదాగా బొమ్మ తుపాకీతో గంటల తరబడి ధనుశ్ ప్రాక్టీస్ చేసేవాడు. అతని ఆసక్తిని గమనించిన పేరెంట్స్ 2015లో గగన్ నారంగ్‌కు చెందిన ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీలో చేర్పించారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2019లో జరిగిన తెలంగాణ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 400కు 400 షూట్ చేసిన తొలి షూటర్‌గా శ్రీకాంత్ రికార్డు నెలకొల్పాడు.


