Telangana SSC marks memo changes : పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. మూడు నెలల తర్వాత ఎట్టకేలకు మార్కుల మెమోలు పాఠశాలలకు చేరాయి. అయితే, ఈసారి చేతికొచ్చిన ధ్రువపత్రాలను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. గ్రేడ్ పాయింట్ల స్థానంలో కేవలం ‘పాస్’ అని ఉండటం, కొత్తగా ‘పెన్’ నంబర్ కనిపించడం వంటి అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అసలు ఈ మార్పుల వెనుక ఉద్దేశం ఏమిటి..? భవిష్యత్తులో ఈ ‘పెన్’ నంబర్ పాత్ర ఏంటి…? ఇంటర్నల్ మార్కులపై నెలకొన్న గందరగోళానికి ప్రభుత్వం తెరదించిందా..?
పదో తరగతి వార్షిక పరీక్షల తుది మార్కుల జాబితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. స్పీడ్ పోస్టు ద్వారా పంపిన ఈ మెమోలు సోమవారం నాటికి రాష్ట్రంలోని చాలా పాఠశాలలకు చేరాయి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో ఈ ఏడాది నుంచి గ్రేడ్ల విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన బోర్డు, అందుకు అనుగుణంగానే ధ్రువపత్రాల్లో కీలక మార్పులు చేసింది.
గ్రేడ్లకు స్వస్తి.. మార్కులకే ప్రాధాన్యం : గత ఏడాది వరకు సబ్జెక్టుల వారీగా వచ్చిన గ్రేడ్లను కలిపి మొత్తం గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ప్రకటించేవారు. అయితే, ఈ విధానం విద్యార్థుల్లో అనవసరమైన పోటీకి, ఒత్తిడికి కారణమవుతోందని భావించిన ప్రభుత్వం, 2024-25 విద్యా సంవత్సరం నుంచి మార్పులకు శ్రీకారం చుట్టింది.
మొత్తం మార్కులు మాయం: తాజాగా విడుదలైన మెమోల్లో మొత్తం మార్కులు గానీ, జీపీఏ గానీ లేవు. ఆ స్థానంలో కేవలం ‘పాస్’ అని మాత్రమే ముద్రించారు. విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవాలంటే, ప్రతి సబ్జెక్టు మార్కులను విడిగా కూడాల్సిందే.
స్పష్టంగా ఇంటర్నల్స్: ప్రతి సబ్జెక్టులో వార్షిక పరీక్ష (External) మార్కులతో పాటు, ఇంటర్నల్ మార్కులను కూడా స్పష్టంగా పొందుపరిచారు.
కొత్తగా ‘పెన్’ నంబర్ : ఈసారి మెమోల్లో వచ్చిన మరో ముఖ్యమైన మార్పు ‘పెన్’ (PEN – Permanent Education Number) నంబర్‌ను చేర్చడం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూడైస్ ప్లస్ విధానంలో భాగంగా, ప్రతి విద్యార్థికి వారి ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసి ఈ శాశ్వత విద్యా నంబర్‌ను కేటాయించారు. ఉన్నత చదువులు, భవిష్యత్తులో ఉద్యోగాల సమయంలో ఈ నంబర్ ఆధారంగానే విద్యార్థి విద్యాపరమైన వివరాలను సులభంగా ధ్రువీకరించుకుంటారు.
ఇంటర్నల్స్‌పై వీడిన ఉత్కంఠ : ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానం ఉంటుందా? ఉండదా? అని గత కొన్ని రోజులుగా విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో నెలకొన్న గందరగోళానికి విద్యాశాఖ తెరదించింది. గతంలో మాదిరిగానే 20 శాతం ఇంటర్నల్, 80 శాతం ఎక్స్‌టర్నల్ మార్కుల విధానాన్నే కొనసాగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇటీవలే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దిల్లీలో ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించిన కార్యశాల అనంతరం ఈ అంశంపై పునరాలోచించిన అధికారులు, పాత పద్ధతికే మొగ్గుచూపారు.


