2025-2026 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్(Budget) మెుత్తం రూ.3 లక్షల కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ప్రస్తుత ఏడాది బడ్జెట్ రూ. 2.90 కోట్లు కాగా ఆదాయం అంచనాల కన్నా రూ. 50 వేల కోట్ల వరకూ తగ్గుదల నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
దీనికి ముందుగా ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి గ్రాంట్లు ఆశించిన మేర స్థాయిలో రాకపోవటంతో ఈ సంవత్సరం ఆదాయం లక్ష్యాల మేరకు రాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం లోక్ సభ ఎన్నికల కారణంగా 2024 ఫిబ్రవరిలో తొలుత ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను ఏప్రిల్, మే, జూన్ నెలల కోసం శాసన సభలో ప్రవేశ పెట్టింది.
మిగిలిన 9 నెలల కోసం 2024 జూలై 25 వ తేదీన పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. మెుత్తం ఆ ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను తొలిసారి ఇప్పుడు ప్రవేశపెట్టబోతుంది. రాష్ట్ర ఆదాయం, పూర్తి వాస్తవాలు తెలిశాయని, వాస్తవిక అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రభుత్వం తెలిపింది.