Saturday, November 15, 2025
HomeతెలంగాణTeacher Surplus: సర్దుబాటు చేసినా.. సర్దుకోని లెక్క! రాష్ట్రంలో 10 వేల మంది మిగులు టీచర్లు

Teacher Surplus: సర్దుబాటు చేసినా.. సర్దుకోని లెక్క! రాష్ట్రంలో 10 వేల మంది మిగులు టీచర్లు

Surplus teacher statistics in Telangana : తెలంగాణ విద్యా వ్యవస్థలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఓవైపు కొన్ని బడుల్లో విద్యార్థులు లేక బోసిపోతుంటే, మరోవైపు కొన్ని బడుల్లో టీచర్ల కొరత వేధిస్తోంది. ఈ రెండింటినీ సమన్వయం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఓ చేదు నిజాన్ని వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరానికి మించి ఏకంగా 10,000 మంది ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారని పాఠశాల విద్యాశాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. మరి ఇంతమంది అదనంగా ఉన్నప్పుడు, ఇంకా 3,000 బడుల్లో టీచర్ల కొరత ఎందుకు ఉంది? ఈ సంఖ్యల వెనుక ఉన్న అసలు కథేంటి?

- Advertisement -

అదనమో మాయ.. కొరతో వ్యథ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24,238 ప్రభుత్వ పాఠశాలల్లో 1.08 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. హేతుబద్ధీకరణలో భాగంగా విద్యాశాఖ అధికారులు చేపట్టిన గణాంకాల సేకరణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 8,600 పాఠశాలల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు ఉండగా, మరో 3,000 పాఠశాలలు టీచర్ల కొరతతో సతమతమవుతున్నాయి. ఇప్పుడు అదనంగా ఉన్న పాఠశాలల నుంచి కొరత ఉన్న బడులకు టీచర్లను సర్దుబాటు చేసినప్పటికీ, ఇంకా సుమారు 10,000 మంది ఉపాధ్యాయులు మిగులుగానే ఉంటారని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారంగా మారుతోంది.

తగ్గుతున్న  విద్యార్థుల.. పెరుగుతున్న ‘జీరో’ బడులు : ఈ సమస్యకు ప్రధాన కారణం ప్రభుత్వ పాఠశాలల్లో క్రమంగా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యే. గతేడాది (2024-25) ప్రభుత్వ బడుల్లో 16.82 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఈ విద్యా సంవత్సరానికి (2025-26) వారి సంఖ్య 16.58 లక్షలకు పడిపోయింది. అంటే, ఒక్క ఏడాదిలోనే 24 వేల మంది విద్యార్థులు తగ్గారు. మరోవైపు, ఒక్క విద్యార్థి కూడా చేరని (జీరో ఎన్‌రోల్‌మెంట్) పాఠశాలల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గతంలో 1,961గా ఉన్న ఈ పాఠశాలల సంఖ్య ప్రస్తుతం 1,925కు తగ్గినా, కొత్తగా ఈ ఏడాది 113 పాఠశాలలు ఈ జాబితాలో చేరడం గమనార్హం. అంతేకాకుండా, రాష్ట్రంలో ఒక్క విద్యార్థే ఉన్న బడులు 55, పది మందిలోపు విద్యార్థులున్న బడులు ఏకంగా 4,325 ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

వెయ్యి దాటిన బడులు.. వేళ్లపైనే లెక్కింపు : రాష్ట్రంలోని 24 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 15 చోట్ల మాత్రమే వెయ్యికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో గద్వాల పట్టణంలో మూడు, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎనిమిది (నాంపల్లి, కూకట్‌పల్లి, జగద్గిరినగర్‌, శివరాంపల్లి, హయత్‌నగర్, జిల్లెలగూడ, శేరిలింగంపల్లి, మణికొండ) ఉన్నాయి. అత్యధికంగా మణికొండ పాఠశాలలో 1,372 మంది విద్యార్థులున్నారు. ఈ గణాంకాలు కొన్ని పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలపై తీవ్రమైన ఒత్తిడిని, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల దుస్థితిని కళ్లకు కడుతున్నాయి.

తరగతికో టీచర్.. తీరని డిమాండ్ : మరోవైపు, 2,900 పాఠశాలల్లో దాదాపుగా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 1,705 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 1 నుంచి 5వ తరగతి వరకే నడుస్తున్న కొన్ని ప్రాథమికోన్నత పాఠశాలలను కూడా కలిపారు. ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలన్నది ఉపాధ్యాయ సంఘాల చిరకాల డిమాండ్. ఈ నేపథ్యంలో, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది టీచర్లు ఉన్న బడుల్లో విద్యా నాణ్యత ఎలా ఉందో పరిశీలించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వారిలో బీసీలు 54.12%, ఎస్సీలు 24.54%, ఎస్టీలు 12.94% ఉండగా, జనరల్ కేటగిరీ విద్యార్థులు కేవలం 8.40% మాత్రమే ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad