Severe urea shortage impacting farmers in Telangana : చెప్పులే వరుసలో… రైతన్న రోడ్డుపై! తెల్లవారుజాము చలిని లెక్కచేయక, క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు. తీరా కేంద్రం వద్దకు వెళ్తే ‘యూరియా లేదు’ అనే సమాధానం. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద కనపడుతున్న హృదయ విదారక దృశ్యం. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా, పంటకు ప్రాణాధారమైన యూరియా అందక రైతన్న విలవిలలాడుతున్నాడు. సహనం నశించి, ఆవేదన ఆగ్రహంగా మారి అన్నదాతలు రహదారులపై ఆందోళనలకు దిగుతున్నారు. అసలు ఈ యూరియా కష్టాలకు కారణం ఎవరు? అన్నదాత ఆశలు ఆవిరవుతున్నాయా..? ప్రభుత్వాల నిర్లక్ష్యానికి పంటలు బలికానున్నాయా..? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది..?
తెల్లవారకముందే పడిగాపులు.. సొమ్మసిల్లుతున్న రైతులు : రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రరూపం దాల్చింది. మెదక్, నల్గొండ, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్.. ఇలా జిల్లా ఏదైనా పరిస్థితి ఒక్కటే. తెల్లవారుజాము 3 గంటల నుంచే రైతులు సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గంటల తరబడి నిలబడలేక, తమ స్థానంలో చెప్పులు పెట్టి పక్కన నీరసంగా కూర్చుంటున్నారు. హనుమకొండ జిల్లాలో ఓ రైతు గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 15 రోజులుగా ఈ కష్టాలు కొనసాగుతున్నా, ప్రభుత్వాల నుంచి సరైన స్పందన కరువైందని రైతులు మండిపడుతున్నారు.
అన్నదాత ఆగ్రహ జ్వాల.. రహదారుల దిగ్బంధం : వారం రోజులుగా తిరుగుతున్నా కనీసం ఒక్క బస్తా యూరియా కూడా దొరకకపోవడంతో రైతుల సహనం కట్టలు తెంచుకుంది. మెదక్ జిల్లా చేగుంట, కౌడిపల్లి, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి వంటి అనేక ప్రాంతాల్లో రైతులు జాతీయ రహదారులపై బైఠాయించి రాస్తారోకోలు నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. తమకు యూరియా అందే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
రైతుల ఆవేదన వారి మాటల్లోనే: “పాస్ బుక్, ఆధార్ జిరాక్స్ పట్టుకుని వారం రోజుల నుంచి తిప్పుతున్నారు. కనీసం ఒక్క బస్తా కూడా ఇవ్వడం లేదు. నాటు వేసి నెల దాటింది. ఇప్పుడు యూరియా వేయకపోతే పంట మొత్తం ఎండిపోతుంది. అప్పులు చేసి పెట్టుబడి పెడితే, తీరా సమయానికి ఎరువు దొరక్కపోతే మేమెలా బతకాలి? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మా సమస్యను వెంటనే పరిష్కరించాలి. యూరియా ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదు.”
ఎందుకీ కొరత? అధికారుల సమాధానమేంటి : రైతులు ఇంతలా ఆందోళన చెందుతున్నా, అధికారుల నుంచి నిర్లక్ష్యపు సమాధానాలే వస్తున్నాయి. చాలా కేంద్రాల్లో “యూరియా నిల్వలు లేవు, పైన నుంచి సరఫరా రాలేదు” అని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. “రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియాను అందుబాటులో ఉంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. అంతేకాకుండా, ఉద్దేశపూర్వకంగా కొరతను సృష్టించి, దానిని ఇతర మార్గాలకు తరలిస్తున్నాయని వారు ఆరోపణలు చేశారు.”
సమయానికి యూరియా అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి, రాష్ట్రంలో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.


