Saturday, November 15, 2025
HomeతెలంగాణLife Tax : వాహనదారులకు 'ట్యాక్స్' వాత.. కొత్త బండి కొంటే జేబుకు చిల్లే.. ఫ్యాన్సీ...

Life Tax : వాహనదారులకు ‘ట్యాక్స్’ వాత.. కొత్త బండి కొంటే జేబుకు చిల్లే.. ఫ్యాన్సీ నంబర్ల ధరలకు రెక్కలు!

Telangana Vehicle Life Tax Hike : కొత్తగా కారు లేదా బైక్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఒక్క క్షణం ఆగండి! మీ బడ్జెట్‌కు ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోంది. వాహనదారులు చెల్లించే జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)ను భారీగా పెంచుతూ రవాణా శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు, మీకు ఇష్టమైన ఫ్యాన్సీ నంబర్ కావాలంటే.. దాని ధర కూడా ఆకాశాన్నంటింది. ఇంతకీ, ఏయే వాహనాలపై ఎంత భారం పడనుంది..? సామాన్యుడి జేబుకు ఎంత చిల్లు పడుతుంది..?

- Advertisement -

ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ : కొత్తగా కొనుగోలు చేసే వ్యక్తిగత వాహనాలపై జీవితకాల పన్నును పెంచుతూ, ఫ్యాన్సీ నంబర్ల ధరలను సవరిస్తూ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ జీవో 53, 54లను జారీ చేశారు. ప్రస్తుతానికి ఇది ప్రాథమిక నోటిఫికేషన్ దశలో ఉంది. దీని ప్రకారం, ఖరీదైన వాహనాలపై పన్ను భారం ఒకటి నుంచి ఆరు శాతం వరకు పెరగనుంది.

కార్లపై భారం ఇలా..
రూ.10 లక్షలలోపు: మీ కారు ఎక్స్-షోరూం ధర రూ.10 లక్షల లోపు ఉంటే ఎలాంటి అదనపు భారం ఉండదు. పాత పన్ను విధానమే వర్తిస్తుంది.

రూ.10 – 20 లక్షలు: కారు ధర రూ.10 లక్షలు దాటి రూ.20 లక్షల లోపు ఉంటే, అదనంగా ఒక శాతం పన్ను చెల్లించాలి.

రూ.50 లక్షలు దాటితే: వాహనం ఖరీదు రూ.50 లక్షలు దాటితే, అదనంగా 2 శాతం పన్ను కట్టాల్సిందే.

కంపెనీ వాహనాలకు: ఇక కంపెనీలు, సంస్థల పేరు మీద రిజిస్టర్ అయ్యే వాహనాలకు (10 సీట్ల లోపు) రూ.20-50 లక్షల మధ్య ఉంటే 22%, రూ.50 లక్షలు దాటితే ఏకంగా 25% లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

సామాన్యుడి బైక్‌పై..
రూ.లక్ష లోపు: ద్విచక్ర వాహనం ఎక్స్-షోరూం ధర రూ.లక్ష లోపు ఉంటే, మీపై ఎలాంటి అదనపు భారం పడదు.

రూ.లక్ష దాటితే: బైక్ ధర రూ.లక్ష దాటితే 3 శాతం, రూ.2 లక్షలు దాటితే ఏకంగా 6 శాతం అదనపు లైఫ్ ట్యాక్స్ విధించారు.

ఉదాహరణకు: రూ.1.10 లక్షల విలువైన బైక్‌కు ఇప్పటివరకు రూ.13,200 లైఫ్ ట్యాక్స్ ఉండగా, కొత్త విధానం ప్రకారం ఇది రూ.16,500 అవుతుంది. అంటే, మీపై అదనంగా రూ.3,300 భారం పడుతుంది.

కోరుకున్న నంబర్.. కొండెక్కింది : ఫ్యాన్సీ నంబర్ కావాలనుకునే వారి ఆశలపై రవాణా శాఖ నీళ్లు చల్లింది. గతంలో 5 శ్లాబుల్లో ఉన్న ఫీజులను ఇప్పుడు 7 శ్లాబులకు పెంచేసింది.
గతంలో అత్యంత డిమాండ్ ఉండే 9999 నంబర్‌కు కనీస ధర రూ.50,000 ఉండగా, ఇప్పుడు దానిని ఏకంగా రూ.1.50 లక్షలకు పెంచారు.

కొత్త శ్లాబులు: రూ.1.50 లక్షలు, రూ.లక్ష, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.6 వేలుగా కొత్త ధరలను నిర్ధారించారు. ఈ పెంపుదలపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత తుది నోటిఫికేషన్ వెలువడనుంది. ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో కొత్త వాహనం కొనాలంటే అదనపు భారం మోయక తప్పదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad