Telangana’s first female Pro Kabaddi official : కోట్లాది మందిని టీవీలకు కట్టిపడేసే ప్రో కబడ్డీ లీగ్.. ఆటగాళ్ల విన్యాసాలు, పట్టు బిగించే రైడ్‌లతో మైదానం హోరెత్తిపోతుంటుంది. కానీ, ఈ హోరాహోరీ పోరును నిబంధనల చట్రంలో, సజావుగా నడిపించే తెరవెనుక సారథులు కొందరుంటారు. అలాంటి అత్యంత కీలకమైన టెక్నికల్ అఫిషియల్ పాత్రలో, తెలంగాణ నుంచి ఓ మహిళ చరిత్ర సృష్టించారు. ఆమే చిర్మని శ్వేతరెడ్డి. మారుమూల రైతు కుటుంబం నుంచి వచ్చి, ఎన్నో అవరోధాలను అధిగమించి, ప్రో కబడ్డీకి ఎంపికైన తొలి తెలంగాణ మహిళగా ఆమె ఎలా నిలిచారు? ఆమె ప్రస్థానంలోని మలుపులేంటి? ఈ విజయం వెనుక ఉన్న స్ఫూర్తిదాయక కథేంటి?
మట్టిలో ఆడి.. మ్యాట్‌పై గెలిచి : రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్వేతది ఓ సాధారణ వ్యవసాయ కుటుంబం. నాన్న వెంకటరామిరెడ్డి, అమ్మ ఇందిర. చిన్నప్పటి నుంచి మట్టిలో ఆడిన కబడ్డీయే ఆమెకు ప్రాణమైంది. పాఠశాల స్థాయిలోనే తన ప్రతిభతో రాష్ట్రస్థాయికి ఎదిగి, స్పోర్ట్స్ కోటాలో నవోదయలో ఇంటర్ సీటు సంపాదించింది. పరుగులో ఆమెకున్న వేగాన్ని చూసి ఉపాధ్యాయులు ఖోఖో వైపు ప్రోత్సహించినా, కబడ్డీ మీదున్న మక్కువతో ఆ ఆటనే అంటిపెట్టుకుని జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటింది.
నిరాశ.. వివాహం.. పునరాగమనం : డిగ్రీలో యూనివర్సిటీ జట్టుకు ఎంపికయ్యానన్న ఆనందం ఆమెకు ఎంతోసేపు నిలవలేదు. పోటీలకు రెండు రోజులుందనగా జట్టు నుంచి తన పేరు తొలగించారని తెలిసి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ బాధతో కొన్ని రోజులు ఆటకు దూరమయ్యారు. అదే సమయంలో కుటుంబ పరిస్థితుల రీత్యా వివాహం జరిగింది. “ఇది మగవాళ్ల ఆట, మన ఇంట్లో ఆడవాళ్లు ఆడలేదు, నువ్వూ వదిలెయ్” అంటూ భర్త సత్య శివరెడ్డి పెట్టిన నిబంధన ఆమె కలను కూకటివేళ్లతో పెకిలించే ప్రయత్నం చేసింది.
అయినా శ్వేత పట్టు వదల్లేదు. భర్తను ఒప్పించడానికి ఆమెకు ఏడాది పట్టింది. తన సంకల్పం ముందు సవాళ్లు తలవంచాయి. వ్యాయామ ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొంది, తనేంటో నిరూపించుకున్నారు. తన శిక్షణలో ఎందరో విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దారు. ఒకప్పుడు వద్దన్న భర్తే, ఇప్పుడు ఆమెకు వెన్నుదన్నుగా నిలవడం విశేషం.
రెఫరీగా కొత్త ప్రస్థానం : “ప్రో కబడ్డీ మొదలైనప్పటి నుంచి ఆసక్తిగా గమనించేదాన్ని. స్కూల్ ఫెడరేషన్ పోటీలకు తెలంగాణ అసోసియేషన్ సిబ్బంది వచ్చినప్పుడు, నేనూ వారిలో ఒకరిగా ఉండాలని బలంగా అనుకున్నా. ఆ పట్టుదలతోనే రాష్ట్రస్థాయి పోటీలకు రెఫరీగా పనిచేశా. నా పనితీరును గుర్తించి జాతీయ స్థాయికి సిఫారసు చేశారు” అని శ్వేత తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్ఐ) నిర్వహించే కఠినమైన పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ప్రో కబడ్డీ లీగ్‌కు టెక్నికల్ అఫిషియల్‌గా ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ మహిళగా చరిత్ర పుటల్లో నిలిచారు. “ఆటకు ఆడ, మగ తేడా లేదు. ఆసక్తి ఉంటే అమ్మాయిలు వెనకాడొద్దు. తెలంగాణ నుంచి ఈ స్థాయికి ఎదిగినందుకు గర్వంగా ఉంది,” అని శ్వేతరెడ్డి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఆమె విజయం ఎందరో గ్రామీణ యువతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.


