సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే(Cast Census Report) తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ(TG Assembly) ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా ఈ కులగణన సర్వే చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఈ తీర్మానం చేశారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదనలు జరిగాయి. బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్, బీజేపీ నుంచి పాయల్ శంకర్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సీపీఐ నుంచి సాంబశివరావు మాట్లాడారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం, మంత్రులు సమాధానం చెప్పారు. అనంతరం ఈ సర్వేకు అసెంబ్లీలో ఆమోదం లభించింది.
అలాగే ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఎస్సీ వర్గీకరణ చేపడతామన్నారు. వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని.. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అంతకుముందు తెలంగాణ శాసన మండలి కూడా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. మొత్తం మూడు వర్గాలుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషన్ ఇచ్చిన నివేదికకు మండలి ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.