Telangana 10th Class Internal Exams: పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఉన్నాయా? లేవా? అనే విషయంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న దాదాపు 5 లక్షల మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే తాజాగా.. ఇంటర్నల్ మార్కులు ఎత్తేయాలన్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాత పద్ధతిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానం కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. పదో తరగతి పరీక్షల్లో 80 శాతం ఎక్స్‌టర్నల్ మార్కులు, 20 శాతం ఇంటర్నల్ మార్కులు కేటాయించనున్నట్లు విద్యాశాఖ GO జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు.
భిన్నాభిప్రాయాలు రావడంతో..
కాగా, ఇంటర్నల్ మార్కులను తొలగిస్తూ గత ఏడాది నవంబరులో ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి నుంచి 100 మార్కులకు ప్రశ్నాపత్రం రూపొందించాలని ప్రభుత్వం భావించింది. సాధ్యాసాధ్యాలపై నిపుణులతో చర్చించింది. కానీ ఇటీవలే దిల్లీలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(NCERT) నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
దీంతో పునరాలోచనలో పడిన ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా పాత విధానాన్నే కొనసాగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.


