Today Rain In TG: రాష్ట్రంలో నిన్న ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన కుండ పోత వానలకు వాగులు నిండిపోయాయి. భీమ్‌పూర్‌లో 90 మి.మీ. వర్షాలు కురిశాయి. నేడు కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మిగతా అన్ని ప్రాంతాలలో ఈరోజు రుతుపవనాలు మందకొడిగా ఉంటాయని పేర్కొంది. అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు లేదా పొడి వర్షాలు మాత్రమే ఉంటాయని చెప్పింది. ఇక హైదరాబాద్ లో నిన్నటిలాగే స్వల్ప వర్షాలు మాత్రమే ఉంటాయని తెలిపింది.
గోదావరి వరద హెచ్చరిక:
విదర్భ నుంచి వస్తోన్న భారీ వరదల కారణంగా, వైన్ గంగ తెలంగాణలోకి 2.7 లీటర్ క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను విడుదల చేస్తోంది. విదర్భ వరదల కారణంగా వార్ధా, శబరి నదులకు కూడా భారీగా వరద నీరు చేరుతోంది. నేటికి కాళేశ్వరానికి 5-6 లీటర్ క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
గడిచిన 24 గంటల్లో:
ఇక నిన్న మిగతా ప్రాంతాల విషయానికొస్తే.. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ సంగారెడ్డిలలో చెదురుమదురుగా వర్షాలు కురిసాయి. హైదరాబాద్‌లో కూడా స్వల్ప వర్షాలు పడ్డాయి. ఊహించినట్లుగానే, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, యాదాద్రి, నల్గొండ, సిరిసిల్ల, కరీంనగర్, జనగాంలలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసాయి. సాయంత్రం రాత్రి వేళల్లో మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసాయి.ఇతర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అడపాదడపా వర్షాలు పడతాయని అన్నారు. నేడు కూడా హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో వాతావరణం నిన్నటిలాగే మధ్యాహ్నం వరకు పొడిగా ఉంటుందని.. ఆ తర్వాత సాయంకాలం నుండి రాత్రి వరకు స్వల్ప వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు చురుకుగా మారడానికి అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించి, రైతాంగానికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలిపింది.


