TGSRTC driver mobile phone ban : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని సంస్థ భరోసా ఇస్తున్నా, అడపాదడపా జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. అనేక ఘటనల్లో డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమవుతోందని, ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌లో మాట్లాడటం పెను ప్రమాదాలకు దారితీస్తోందని ఆర్టీసీ గుర్తించింది. ఈ నేపథ్యంలో, ప్రయాణికుల భద్రతే పరమావధిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై స్టీరింగ్ పట్టుకున్న డ్రైవర్ చేతిలో సెల్‌ఫోన్ కనిపించకూడదు.
ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ టీజీఎస్ ఆర్టీసీ మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్లు మొబైల్ ఫోన్లు వాడటాన్ని పూర్తిగా నిషేధించింది. డ్రైవర్లు మద్యం సేవించి విధులకు రాకుండా ఇప్పటికే డిపోల్లో బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తుండగా, తాజాగా ఫోన్ వినియోగంపై ఉక్కుపాదం మోపింది. డ్రైవింగ్‌పై ఏకాగ్రతను దెబ్బతీసి, ప్రమాదాలకు కారణమవుతున్న సెల్‌ఫోన్ వాడకాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 11 రీజియన్ల పరిధిలో ఒక్కో డిపో చొప్పున అమలు చేస్తున్నారు. కరీంనగర్ రీజియన్ నుంచి జగిత్యాల డిపోను ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు.
విధుల్లోకి వెళ్లేముందు ఫోన్ డిపాజిట్: సెప్టెంబర్ 1 నుంచి జగిత్యాల డిపోలో ఈ ఫోన్ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. డ్రైవర్లు విధుల్లోకి ప్రవేశించే ముందే తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్లను డిపోలోని సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ రిజిస్టర్‌ను కూడా నిర్వహిస్తున్నారు. డ్యూటీ పూర్తయ్యాక ఫోన్‌ను తిరిగి తీసుకువెళ్లవచ్చు. జగిత్యాల డిపోలో సొంత, అద్దె బస్సులతో కలిపి మొత్తం 115 బస్సులు ఉండగా, 265 మంది డ్రైవర్లు ఈ నిబంధనను పాటిస్తూ ఫోన్లు లేకుండానే విధులకు హాజరవుతున్నారు.
అత్యవసరమైతే.. కంట్రోల్ రూమ్ నుంచి: డ్యూటీలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే, బస్టాండ్‌కు చేరుకున్నాక అక్కడి కంట్రోల్ రూమ్‌లో అందుబాటులో ఉంచిన సీయూజీ (CUG) ఫోన్ల ద్వారా డ్రైవర్లు తమ వారికి ఫోన్ చేసి మాట్లాడుకునే వెసులుబాటు కల్పించారు.
పకడ్బందీ నిఘా.. కండక్టర్‌కూ బాధ్యత: ఈ నిషేధం అమలును పర్యవేక్షించేందుకు అధికారులు పటిష్ఠమైన చర్యలు చేపట్టారు. డ్రైవర్ ఫోన్ మాట్లాడితే ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యతను కండక్టర్‌పై ఉంచారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదు వచ్చినా, తనిఖీల్లో పట్టుబడినా డ్రైవర్‌తో పాటు నిర్లక్ష్యం వహించిన కండక్టర్‌పైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా, రీజియన్ల వారీగా ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సాధారణ ప్రయాణికుల్లా బస్సుల్లో ప్రయాణిస్తూ, నిషేధం అమలు తీరును రహస్యంగా పర్యవేక్షిస్తాయి.
రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సన్నాహాలు: గత నెలన్నర రోజులుగా అమలవుతున్న ఈ ప్రయోగం సత్ఫలితాలనిస్తోందని అధికారులు గుర్తించారు. దీంతో త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లోనూ అమలు చేసేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కొన్ని సర్వీసులకు మినహాయింపు: అయితే, కండక్టర్లు లేకుండా నడిచే సూపర్ లగ్జరీ వంటి కొన్ని సర్వీసుల్లో మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. రిజర్వేషన్ వివరాలు, టికెట్ జారీ (టిమ్) అవసరాల కోసం ఆ సర్వీసుల డ్రైవర్ల వద్ద ఫోన్‌ను అనుమతిస్తున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్ కల్పన తెలిపారు.


