భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేయడం ద్వారా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా కమిటీ సభ్యులతో దేవాదాయ శాఖ ఇన్ స్పెక్టర్ ప్రమాణం చేయించారు. అనంతరం కమిటీ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకమండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు సమన్వయంతో ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఆలయం ముందు ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న రోడ్డు అభివృద్ధి, డ్రైనేజీ సమస్యను తానే నిధులు మంజూరు చేయించి పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అధికారులు శేఖర్ ఆండాలు, మాజీ కార్పొరేటర్ లాస్య నందిత, నూతన చైర్మన్ సంతోష్ యాదవ్, వేణుగోపాల చారి, నర్సింగ్ రావు, పద్మజ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.