ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలను గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతి శుభాకార్యంలోను తొలిపూజలు అందుకునే ఆదిదేవుడు గణనాధుడు అని అన్నారు. గణేష్ నవరాత్రుల సందర్బంగా సనత్ నగర్ డివిజన్ పరిధిలోని లోధా అపార్ట్మెంట్,నెహ్రూ పార్క్,శ్యామలకుంట, ఆదిత్య నగర్, సుభాష్ నగర్, రవీందర్ నగర్ తదితర ప్రాంతాలలో కొలువుదీరిన వినాయక మండపాలను మంత్రి సందర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆయా మండపాల వద్ద పూజల అనంతరం మంత్రిని నిర్వహకులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని పండుగలు, ఉత్సవాల నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లను చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.గణేష్ ఉత్సవాల సందర్బంగా నగరం పరిధిలో సుమారు 90 వేల విగ్రహాల వరకు ప్రతిష్టించినట్లు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనం కు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసిందని చెప్పారు. నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా వచ్చే లక్షలాది మంది భక్తులకు త్రాగునీటిని కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, ఆర్ సి పటేల్, పుట్ట శేఖర్,సరాఫ్ సంతోష్,భూపాల్ రెడ్డి, సురేష్ గౌడ్,రాజేష్ ముదిరాజ్,వేణుగోపాల్, సుబ్బారావు,శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.