దేశంలోనే అత్యధిక కెమెరాలను ఏర్పాటు చేసిన నగరంగా హైదరాబాద్ కు గుర్తింపు ఉన్నదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోనే అత్యధిక సీసీ కెమెరాలను సనత్ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.శాంతి భద్రతల పర్యవేక్షణ,నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పోలీసు అధికారులతో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణా సచివాలయంలోని తన చాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం తన అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి కోటి 50 లక్షల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. 100 మంది పోలీసులు చేయగల పనిని ఒక్క సీసీ కెమేరా చేస్తుందని అన్నారు. తాను నియోజకవర్గ పరిధిలో పర్యటించిన సందర్బాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పలు కాలనీలు,బస్తీల నుండి విజ్ఞప్తులు వస్తున్నాయని, నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలలో నూటికి నూరు శాతం సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాల పనితీరును కూడా తరచూ పర్యవేక్షిస్తుండాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ గజారావు భూపాల్,ఐటీ విభాగానికి చెందిన ఏసీపీ చాంద్ పాషా, ఇన్ స్పెక్టర్ విశాల్, నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి, ఏసీపీలు రమేష్, పృథ్విధర్ రావు, మోహన్ కుమార్, విజయ్ పాల్ రెడ్డి,గాంధీ నగర్,సనత్ నగర్ ఎస్.హెచ్.వోలు మోహన్ రావు, బాలరాజ్ పాల్గొన్నారు.