Saturday, November 23, 2024
HomeతెలంగాణThalasani: ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు నూతన రోడ్లు

Thalasani: ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు నూతన రోడ్లు

రాజధాని నగరంలో ఎన్నో కొత్త మార్గాలు

ఎన్నో సంవత్సరాల నుండి సనత్ నగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు రూ.210 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాణిగంజ్ లో రైల్వే బ్రిడ్జి(ఆర్.యూ.బి) విస్తరణ, సనత్ నగర్ ఆర్ఓబి, ఫతేనగర్ ఫ్లై ఓవర్ విస్తరణ (ఆర్ఓబి) పనుల పురోగతిపై బుద్ధ భవన్ లో రైల్వే, జిహెచ్ఎంసి, ఎలెక్ట్రికల్ తదితర శాఖల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం వీటి నిర్మాణం కోసం రూ.210 కోట్లను మంజూరు చేసిందని, అందుకు సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం నూతన రోడ్ల నిర్మాణం, అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్ లు,లింక్ రోడ్ల అభివృద్దికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందులో భాగంగానే సనత్ నగర్ లోని ఇండస్ట్రియల్ ప్రాంతం నుండి బాలా నగర్ వరకు అండర్ పాస్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.105 కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. అమీర్‌పేట‌ లోని కనకదుర్గమ్మ దేవాలయం నుండి ఫతే నగర్ ఫ్లై ఓవర్ వరకు రోడ్డు విస్తరణ చేసి ట్రాఫిక్ తో వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా చేశామన్నారు. ఫతే నగర్ ఫ్లై ఓవర్ పై కూడా ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటున్నందున ప్రస్తుతం ఉన్న 2 లైన్ ల రోడ్డును 4 లైన్ లుగా విస్తరించనున్నట్లు చెప్పారు. ఈ పనులు చేపట్టేందుకుగాను అడ్డంకిగా ఉన్న రైల్వే ట్రాక్ ల వద్ద ఆర్యూబిలను నిర్మించేందుకు రైల్వే, జిహెచ్ఎంసి అధికారుల సమన్వయంతో చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో పనులు చేపట్టేందుకు అనువుగా కొన్ని ప్రాపర్టీస్ ను సేకరించాలని గుర్తించి వాటిలో కొన్ని సేకరించినట్లు తెలిపారు.

మిగిలిన వాటిని కూడా త్వరలోనే సేకరించే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నెల రోజులల్లో పనులు ప్రారంభించే విధంగా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. అదేవిధంగా రాణి గంజ్ రైల్వే బ్రిడ్జి కూడా రోడ్డుకు తగినంత వెడల్పు లేకపోవడం వలన వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అక్రమ నిర్మాణాలను తొలగించి ఆర్యూబి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించడమే తమ లక్ష్యం అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఆయా ప్రాంతాలలో పనులు పూర్తయితే అత్యధిక శాతం వాహనదారుల ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, సనత్ నగర్ కార్పొరేటర్ కోలన్ లక్ష్మి బాల్ రెడ్డి, ఈఎన్సి జియా ఉద్దిన్, చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్రప్రసాద్ నాయక్, హెచ్ఆర్డిసిఎల్ సిఈ సరోజ, ఖైరతాబాద్, నార్త్ జోన్ జోనల్ కమిషనర్ లు వెంకటేష్ దోత్రే, రవి కిరణ్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, రైల్వేస్ డిప్యూటీ సిఈ మనోహర్ రెడ్డి, ఎలెక్ట్రికల్ ఎస్ఈ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News