రోడ్లపై చెత్త వేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ బండి మెట్, మారుతి వీధి, సజన్ లాల్ స్ట్రీట్ లలో వివిధ శాఖల అధికారులతో కలిసి పాదయాత్రగా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నూటికి నూరు శాతం పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకే తాను ఇక్కడకు వచ్చానని వారికి వివరించారు. అన్ని వీధులలో సీవరేజ్, వాటర్ లైన్, రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న పలువురు షాప్స్ నిర్వహకులు చెత్త, ఇతర వ్యర్ధాలను రోడ్లపైనే వేస్తున్నారని, పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని మంత్రి దృష్టికి స్థానికులు తీసుకురాగా, రోడ్లపై చెత్త వేసే వారికి జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. పలు చోట్ల విద్యుత్ తీగలు క్రిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉండటంతో వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎలెక్ట్రికల్ అధికారులను సూచించారు. సజన్ లాల్ స్ట్రీట్ లో నీరనాలా పై అక్రమ నిర్మాణం చేపట్టారని తెలపగా వెంటనే నాలాను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని అధికారులను పురమాయించారు. నాలాపై చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
మంత్రి వెంట డీసీ ముకుంద రెడ్డి, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ జిఎం రమణారెడ్డి, సికింద్రాబాద్ తహసిల్దార్ శైలజ, మహంకాళి ఎసిపి రమేష్, మోండా మార్కెట్ సీఐ నాగేశ్వరరావు, హార్టికల్చర్ డీడీ గణేష్, ఎలెక్ట్రికల్ ఏడీ కృష్ణ, స్ట్రీట్ లైట్ ఏఈ భారత్, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, సత్యనారాయణ, జయరాజ్, అమర్, బాబులాల్, రాము తదితరులు ఉన్నారు.