తెలంగాణ రాష్ట్రం వివిధ బాషలు, వివిధ సంస్కృతులకు నిలయంగా ఉన్నదని, ఇక్కడ స్థిరపడిన ప్రతి ఒక్కరిని తమ బిడ్డలుగా బావించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి అభివృద్దికి చేయూతను అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మహేశ్వరి సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహేశ్వరి మహోత్సవ్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల మనసులను గెలుచుకుందని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని, బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలవుతున్నాయని చెప్పగలరా అని ప్రశ్నించారు.కేవలం దేవుడి పేరు,మతాల పేరుతో ప్రజల మద్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారులు తమ తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారని చెప్పారు.అన్ని వర్గాల ప్రజల ఆచారాలు, సంస్కృతులను ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం మహేశ్వరి సమాజ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మహేశ్వరి సభ అధ్యక్షులు హరినారాయణ రాఠీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహేశ్వరి మహిళా సంఘం అధ్యక్షురాలు రజనీ రాఖే,మహేశ్ ఫౌండేషన్ అధ్యక్షుడు డా.రాధేశ్యామ్ పాడియా,రంగు శారద, మహేష్ బల్ద్వా తదితరులు పాల్గొన్నారు.