Rains in telangana: తెలంగాణలో నేడు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఇప్పటికే చల్లబడింది. హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ముందస్తు హెచ్చరిక:
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా హెచ్చరించారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/tgrtc-ticket-price-30-percent-hiked/
తెలంగాణలో వాతావరణం నిన్నటికీ నేటికీ భిన్నంగా ఉంది. నిన్న రాష్ట్రమంతా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా కనిపించింది.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/mahabubnagar-dry-port-gudibanda-proposal/
అయితే, ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ఈ వర్షాల వల్ల నిన్నటి ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది.


