Monday, June 23, 2025
HomeతెలంగాణMP Raghunandan Rao: సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్

MP Raghunandan Rao: సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్


Threatening call to MP Raghunandan rao: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. ఇవాళ సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో ఫోన్ చేశారు. ఈ ఫోన్ కాల్ ను రఘునందన్ రావు పీఏ లిఫ్ట్ చేశాడు. తాను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయి గూడలో ఓ కార్యక్రమంలో ఉండగా ఈ ఫోన్ కాల్ వచ్చినట్లు డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఎంపీ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు చేశారనే దానిపై విచారణ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో కీలక నేతలు కూడా ఉన్నారు. దీంతో భయపడిన కొంతమంది మాయిస్టులు లొంగిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రంతో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అయితే కేంద్రం మాత్రం చర్చలు చేపట్టే ప్రసక్తే లేదని తేల్చిపోయింది.

దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి కీలక ప్రకటన చేశారు. 2026 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్ సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. మవోయిస్టులతో ఎలాంటి శాంతి చర్చలు చేపట్టబోమని తెలిపారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వారికి ప్రభుత్వం తరపున మరింత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వర్షాకాలంలోనూ మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందని తేల్చిచెప్పారు. కాగా ఆపరేషన్ కగార్ పై మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఉన్నతాధికారులతో అమిత్ షా పలుమార్లు కీలక చర్చలు జరిపారు.

అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు పీపుల్స్ వార్ మవోయిస్టుల పేరుతో చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. ఎవరైనా ఆకతాయి కావాలనే ఫోన్ చేసి బెదిరించాడా.. లేక నిజంగానే మావోయిస్టు ఫోన్ చేశారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News