RTC bus booking on Google Maps : ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలనుకుంటున్నారా? టికెట్ కోసం వెబ్‌సైట్ తెరవాలా లేక బస్టాండుకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా? ఇక ఆ శ్రమ అక్కర్లేదు. మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో, మీరు రోజూ వాడే గూగుల్ మ్యాప్స్‌లోనే నేరుగా టికెట్ బుక్ చేసుకునే అద్భుతమైన సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది.
గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానం.. అరచేతిలో రిజర్వేషన్ : ప్రస్తుతం ఆర్టీసీ బస్సు టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా బస్టాండ్లలోని కౌంటర్ల వద్ద రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే, ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ, టెక్ దిగ్గజం గూగుల్‌తో చేతులు కలిపింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, ప్రయాణికులు తమ మొబైల్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి, తాము వెళ్లాలనుకుంటున్న గమ్యస్థానాన్ని నమోదు చేస్తే చాలు. ఆ మార్గంలో అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సుల వివరాలు ప్రత్యక్షమవుతాయి. నచ్చిన బస్సును ఎంచుకుని, అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవచ్చు. ఈ-టికెట్ నేరుగా మీ మొబైల్‌కే వస్తుంది. కేవలం రిజర్వేషన్ ఉన్న బస్సులకే కాకుండా, రిజర్వేషన్ లేని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఇదే విధానంలో టికెట్లు పొందే సౌకర్యాన్ని కల్పించనున్నారు.
అమలు ఎప్పటి నుంచి : తెలంగాణ వ్యాప్తంగా తిరిగే ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసుల పూర్తి సమాచారాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే గూగుల్‌కు అందించింది. ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్‌లో ఈ సమాచారాన్ని అనుసంధానించి, పరీక్షిస్తున్నారు. మరో రెండు, మూడు వారాల్లో ఈ సేవలు ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారంతో ప్రారంభించి, ఆ తర్వాత దశలవారీగా జిల్లా, అంతర్రాష్ట్ర సర్వీసుల వివరాలను జోడించనున్నారు.
పిన్ అక్కర్లేదు.. కార్డు చూపిస్తే చాలు : చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బస్సుల్లో డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపు చేసేటప్పుడు పిన్ నంబర్ నమోదు చేయాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో ఇది ఆలస్యానికి కారణమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు, పిన్ అవసరం లేని ‘ట్యాప్ అండ్ పే’ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రయాణికులు తమ కార్డును టిమ్స్ యంత్రంపై ఉంచగానే, క్షణాల్లో చెల్లింపు పూర్తయి టికెట్ జారీ అవుతుంది. వారం రోజుల్లో ఈ విధానాన్ని తొలుత ఎయిర్‌పోర్ట్ ఏసీ బస్సుల్లో ప్రారంభించి, ఆ తర్వాత సిటీ, దూరప్రాంత బస్సులకు విస్తరించనున్నారు.
‘గమ్యం’ యాప్‌కు విశేష స్పందన : ఇప్పటికే ఆర్టీసీ ప్రవేశపెట్టిన ‘గమ్యం’ యాప్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బస్సు ఎక్కడుంది, ఎప్పుడొస్తుంది వంటి వివరాలను లైవ్‌లో తెలుసుకునే ఈ యాప్‌ను రోజుకు సగటున 10 వేల మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని ఆర్టీసీ ఐటీ చీఫ్ ఇంజినీర్ రాజశేఖర్ తెలిపారు. ఈ యాప్‌లోని ‘ఫ్లాగ్ ఏ బస్’ ఫీచర్ ద్వారా, రాత్రి సమయాల్లో మహిళలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే సౌకర్యం కూడా ఉంది.


